కరోనా విషయంలో డీహెచ్ శ్రీనివాసరావు, మంత్రి ఈటల పొంతనలేని మాటలు

తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.

different arguments regarding the corona : తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది. రానున్న రోజుల్లో కోవిడ్ ప్రభావం మరింతగా ఉండబోతుందని అధికారులు చెబుతుంటే… సంబంధిత శాఖ మంత్రి మాత్రం ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దంటూ హితవు పలికారు.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైద్య పరీక్షల సంఖ్యను పెంచింది. దీంతో రాష్ట్రంలో రోజు 3 వేల నుంచి 4 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 10 మంది కంటే ఎక్కువే చనిపోతున్నారు. ఇటీవల డీహెచ్‌ డాక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే నాలుగైదు వారాలు ప్రమాదకరంగా ఉంటాయని హెచ్చరించారు. గతంలో కంటే సెకండ్ వేవ్‌ వేగంగా వ్యాపిస్తోందని… ప్రజలందరూ జాగ్రత్తలు పాటించకపోతే తెలంగాణ.. మహారాష్ట్రలా తయారుకావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రజల్లో కాస్తంత భయం పెరిగింది.

మరోవైపు కోవిడ్ -19 సంక్షోభంపై దృష్టి సారించిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ… వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టిందన్నారు. 95 మందికి పైగా తెలియకుండానే కరోనా సోకుతోందని… కేవలం 5 శాతం మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజల్లో ఆందోళన తగ్గించే ప్రయత్నం చేశారు. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని.. మాస్క్, శానిటైజర్ మెయింటెన్‌ చేస్తే కరోనా నుంచి కాపాడుకోవచ్చని సూచించారు. అయితే వైద్యారోగ్యశాఖ, సంబంధిత మంత్రి చెప్పే మాటలకు పొంతనలేకపోవడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్ వైద్యసేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితి ఎలా భయంకరంగా ఉందనే విషయాన్ని వివరించారు శ్రీనివాసరావు. అయితే ఆయన వ్యాఖ్యలు అటు వైద్య వర్గాల్లో.. ఇటు ప్రజల్లో ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల్ని భయపెట్టేలా శ్రీనివాసరావు కామెంట్లు ఉన్నాయని గ్రహించిన మంత్రి ఈటల రాజేందర్… జనాలు భయాందోళనకు గురికాకూదని కాస్తంత ధైర్యం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు భయాందోళనకు గురిచేసేలా మాట్లాడొద్దంటూ హెచ్చరించారు కూడా.

తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్ విస్తరిస్తుంటే.. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి శ్రీనివాసరావు, మంత్రి ఈటల రాజేందర్ మధ్య సమన్వయ లోపం మంచిదికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ-అధికార యంత్రాంగం మధ్య గ్యాప్‌తో…. ప్రజల ప్రాణాలకు ముప్పంటున్నారు. అందరిని కలుపుకుని… ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇకనైనా తెలంగాణ వైద్యారోగ్యశాఖ సమన్వయంతో పనిచేసి కరోనాను కట్టడి చేయడంలో సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉంది.

ట్రెండింగ్ వార్తలు