Telangana BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం
హైదరాబాద్ ఎంపీ స్థానంకు మాధవీలతను అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 3, 2024 / 10:31 AM IST
Telangana BJP
Telangana BJP MP Candidates 1st List 2024 : లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కేంద్ర అధిష్టానం సన్నద్ధమవుతోంది. తొలిజాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఫస్ట్ లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. అయితే, మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. హైదరాబాద్ మాధవీలత, మల్కాజ్ గిరి ఈటల రాజేందర్, జహీరాబాద్ బీబీ పాటిల్ ఎంపికపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read : BJP First List : బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఆ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?
జహీరాబాద్ పార్లమెంట్ స్థానంకు బీబీ పాటిల్ ను బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. బీబీపాటిల్ అదే స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరడంతో ఆ స్థానాన్ని బీబీ పాటిల్ కు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి అలె నరేంద్ర కుమారుడు అలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ, ఇద్దరిని కాదని కొత్తగా బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడంపట్ల పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి భాస్కర్, బాగారెడ్డి, వారి వర్గీయులు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీబీ పాటిల్ గత పదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, జహీరాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండటంతో కేవలం టికెట్ కోసమే పాటిల్ బీజేపీలోకి వచ్చాడని అసంతృప్త నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది.
Also Read : Lok Sabha election-2024: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. మల్కాజిగిరి నుంచి ఈటల
హైదరాబాద్ ఎంపీ స్థానంకు మాధవీలతను అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సభ్యత్వం లేని డాక్టర్ మాధవీలతకు ఎలాటి టికెట్ కేటాయిస్తారని అసంతృప్త నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు నియోజకవర్గంలో ఇన్నాళ్లు పార్టీ తరపున పనిచేసిన ఉమా మహేంద్ర, పొన్నం వెంకటరమణారావు, ఉమారాణి వంటి నేతలు మాధవీలత అభ్యర్థిత్వాన్ని తప్పుబడుతున్నట్లు తెలిసింది. ఓల్డ్ సిటీలో ఓవైసీకి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తున్న తమనుకాదని, కనీసం పార్టీ సభ్యత్వంలేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ అధిష్టానాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పలువురు బీజేపీ నేతలు టికెట్ ఆశించారు. ఈటల రాజేందర్ కు అధిష్టానం టికెట్ కేటాయించడం పట్ల ఆశావహుల్లో చాలా మంది అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని పేర్కొనగా.. బీజేపీ సీనియర్ నేత మురళీ ధర్ రావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) వేదికగా కార్యకర్తలను ఉద్దేశించి మురళీధర్ రావు ఓ ట్వీట్ కూడా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నాకోసం పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని పేర్కొన్నారు. అయితే, ఆయన అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తికావడంతో ఆయన పార్టీవీడే అవకాశాలు అయితే లేవు. అయితే, ఆయన మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ విజయానికి పనిచేస్తారా? మరోచోటకు వెళ్లి పనిచేసుకుంటారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
