DK Aruna
DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కు విరాళాలు సేకరించారన్న కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉంది.. అయినా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని డీకే అరుణ ప్రశ్నించారు. 80లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి సూచనమేరకు విరాళాలు ఇచ్చారని, అనేక మంది విరాళాలు ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. డీకే శివ కుమార్ ఇప్పటికే విరాళాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి విరాళాలు పేరుతో ఎంతమంది నుంచి వసూళ్లు చేశారో. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లొచ్చాడని డీకే అరుణ అన్నారు.
Also Read: కవిత లేఖ, కామెంట్స్ పై కేటీఆర్ రియాక్షన్.. ఏదైనా చెప్పాలనుకుంటే..
కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపడుతామని చెప్పారు. కానీ, ప్రకటనలకే తప్ప యాక్షన్ తీసుకోవలం లేదు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారని డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వం సీబీఐని రాకుండా బ్యాన్ విధించింది. గతంలో చెప్పిన విధంగా సీబీఐ విచారణకు ఎందుకు లేఖ రాయడం లేదు. ఈ ప్రభుత్వం కూడా తెలంగాణను దోచుకుంటుంది. హామీలను అమలు చేయడం లో విఫలమైంది. రేవంత్ రెడ్డి పాలించే అర్హత కోల్పోయారు. తెలంగాణ దేశానికే ఆదర్శం అని చెప్పడానికి ఎలా నోరు వస్తుంది..? అంటూ డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన అనంతరం పదేళ్ల పాటు కుటుంబం దోచుకుంది.. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకుని బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అరుణ అన్నారు.
రేవంత్ రెడ్డి టాలెంట్ ఎందులో ఉందో అందరికీ తెలుసు. మోదీని నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధే లేదు. తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుతుందని జీర్ణించుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని డీకే అరుణ ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ విషయం లో దేశ ప్రధాని, సైనికులకు అండగా ఉండాల్సి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కల్లు బైర్లు కమ్మేలా బుద్ధి చెప్పారు. మన దేశం శక్తిని అందరూ మెచ్చుకుంటుంటే అది జీర్ణించుకోలేక మరో రకంగా మాట్లాడుతున్నారంటూ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైంది. వర్షాలకు ధాన్యం తడిసి ముద్దై పోతుంది. 60 లక్షల ఎకరాల్లో 130 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. రెండు నెలలు అవుతున్నా కొనుగోలు పూర్తి కాలేదు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులను ఆదుకోవడం మానేసి కుర్చీ కాపాడుకోవడంపైనే రేవంత్ దృష్టి పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని సరైన సమయం లో సేకరిస్తే మంచి బియ్యం తీయోచ్చు. మరోవైపు, పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. నష్టపరిహారం చెల్లించడం లేదు. పునరావాస కేంద్రాలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పాలమూరు రంగారెడ్డి కి జూరాల నుంచి రావాల్సిన అప్రోచ్ నిర్మించడం లేదు. శ్రీశైలం నుంచి అప్రోచ్ తీసుకోవడం ద్వారా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుందని డీకే అరుణ అన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ అవినీతి చేసినందుకు గద్దె దించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకరికి ఒకరు కవచంలా ఉంటున్నారు. మాకు అధికారం ఇస్తే ఎవరెంత దోచుకున్నారో చెప్తాం. కవిత లేఖపై మాట్లాడుతూ.. సీక్రెట్ గా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో వారే సమాధానం చెప్పాలి. తండ్రి అయినా లీక్ చేయాలి లేదా కవిత లీక్ చేయాలి.. లేదా ఆమె అన్న, భావ అయినా లీక్ చేసి ఉండాలి. కవిత ను ఎప్పటికీ మేం బీజేపీలోకి తీసుకోమని డీకే అరుణ అన్నారు.