కవిత లేఖ, కామెంట్స్ పై కేటీఆర్ రియాక్షన్.. ఏదైనా చెప్పాలనుకుంటే..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

KTR
KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ లేఖపై స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. కవిత, ఆమె రాసిన లేఖ ప్రస్తావన తేకుండానే.. కీలక కామెంట్స్ చేశారు.
కేటీఆర్ ఏం చెప్పారంటే..
లోక్ సభ ఎన్నికల ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశం పెట్టాం. వేల మంది కార్యకర్తలతో కూర్చొని పార్టీలోని అంశాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించాం. ఈ క్రమంలో కొందరు నేతలు అక్కడే మైక్ లో మాట్లాడి వారు చెప్పాల్సిన విషయాలు చెప్పారు. కొందరు చిట్టీల మీద రాసిచ్చినోళ్లు ఉన్నారు.. కొందరు కేసీఆర్ కు ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు అందించిన వారు ఉన్నారు. మా పార్టీ అధ్యక్షుడికి సూచనలు చేయాలంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టే మా పార్టీ అధ్యక్షుడికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే సూచనలు చేయొచ్చు. అయితే, కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నయి.. అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది. లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వారిని కలిసి ఏమైనా ఉంటే చెప్పుకొనే అవకాశం ఉంది. అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. పార్టీలో అందరికీ ఈ నియమం వర్తిస్తుంది. ఈ పార్టీలో ప్రత్యేకంగా ఎవరూ లేరు.. అందరూ కార్యకర్తలే అంటూ కవిత పేరును, ఆమె రాసిన లేఖను ప్రస్తావించకుండా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోవర్టులు వాళ్లకు వాళ్లే బయటపడతారు అంటూ కేటీఆర్ అన్నారు.
కవిత ఏమన్నారంటే..?
అమెరికా నుంచి శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సమయంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లేఖ రాసింది నేనే అంటూనే.. దేవుడు, దెయ్యాలు అంటూ పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు తెరలేపారు. రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాశా. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపా. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, నాకు పర్సనల్ అజెండా లేదు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న వారి వల్లే నష్టం జరుగుతోంది. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది? అంతర్గత లేఖను ఎవరు బయటపెట్టారు. పార్టీలో కోవర్టులు ఉన్నారు. నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో ఉన్న ఇతరుల పరిస్థితి ఏంటి? పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉందంటూ కవిత పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. కోవర్టులు వాళ్లకు వాళ్లే బయటపడతారు అంటూ వ్యాఖ్యానించారు.