Delimitation: డీలిమిటేషన్ పై పోరు.. సీఎం రేవంత్ రెడ్డితో డీఎంకే నేతల భేటీ

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డీఎంకే నేతలు భేటీ అయ్యారు.

CM Revanth Reddy

Delimitation: డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), త్రిభాషా అంశాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 22న చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి సహా పలువురు ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని కోరారు.

 

డీఎంకే నేతలు, ఎంపీలతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని ముందుకెళ్తాం. డీలిమిటేషన్ సౌత్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

 

ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రం అత్యధికంగా పన్నులు చెల్లిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్ పై కిషన్ రెడ్డి తన గళాన్ని కేంద్ర క్యాబినెట్ లో వినిపించాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని పార్టీలతో ఈ సమావేశం నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.