CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మంత్రుల మద్దతు ఏది?

మీనాక్షి ఇంచార్జ్‌గా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట

కాంగ్రెస్‌ అంటేనే ఎవరికి వారు యమునా తీరే. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్తం పార్టీ నేతలు కూడా ఆఫ్‌ ది రికార్డులో ఈ మాటే చెప్తారు. ఒకరు అవునంటే ఇంకొకరు కాదనకపోతే అది కాంగ్రెస్ పార్టీనే కాదన్నంత ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు సీఎం విషయంలో మంత్రుల వైఖరి కూడా అలాగే కనిపిస్తోంది. క్యాబినెట్‌ సహచరులుగా ఉంటూ..తమ బాస్‌ను ఎవరైనా విమర్శిస్తే కౌంటర్ ఇవ్వాల్సింది పోయి అమాత్యులంతా సైలెంట్‌గా ఉంటున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై విప‌క్ష నేత‌లు ఎన్ని విమ‌ర్శలు చేసినా..అనేది తమను కాదు కదా అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట మంత్రులు. మొద‌ట్లో సీఎం రేవంత్‌కు సపోర్ట్‌గా కాస్తో కూస్తో కొంద‌రు మంత్రులు స్పందించేవారు. కానీ ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉండే మినిస్టర్లు కూడా సైలెంట్ అయిపోతున్నారు. మామూలుగా అయితే సీఎంను విప‌క్ష నేత‌లు విమ‌ర్శలు చేస్తే.. మొద‌ట‌గా స్పందించేందుకు ముందు వ‌రుస‌లో మంత్రులే ఉంటారు.

తెలంగాణ‌లో గ‌తంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు విప‌క్ష నేత‌లు ఎవ‌రు విమ‌ర్శలు చేసినా.. మంత్రులు పోటీప‌డి రివర్స్ అటాక్ చేసేవారు. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం చంద్రబాబుపై .. మాజీ సీఎం జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శల‌ను తిప్పికొట్టడంలో మంత్రులు ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. కానీ తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నమైన వాతావ‌ర‌ణం ఉంది.

Also Read: భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియాకు వచ్చాడు.. తిరిగి వెళ్తూ విమాన ప్రమాదంలో దుర్మరణం.. అనాథలైన ఇద్దరు పిల్లలు

సీఎంను ఎవ‌రైనా విమ‌ర్శిస్తే.. మొదట్లో మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, శ్రీధ‌ర్‌బాబు, సీత‌క్క, పొన్నం ప్రభాక‌ర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారు స్పందించే వారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా సీఎంపై విప‌క్ష నేతలు ఎంత ఘాటు విమ‌ర్శలు చేసినా రియాక్ట్ కావడం లేదు. కాళేశ్వరం విచార‌ణ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌..సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. కేటీఆర్ అన్నేసి మాట‌లన్నా.. ఏ ఒక్క మంత్రి క‌నీసం నోరు మెద‌ప‌లేదు. సీఎంకు సన్నిహితులని ప్రచారం ఉన్న మంత్రులు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు.

అయితే మంత్రులు ఇలా మౌనంగా ఉండ‌టానికి కార‌ణం లేక‌పోలేద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌హ‌చ‌ర మంత్రులుగా సీఎంకు అండ‌గా ఉంటూ విప‌క్షాల‌పై విమ‌ర్శలు చేస్తున్నా.. సీఎం నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ ఉండ‌టం లేద‌ట‌. అండ‌గా ఉంటూ స‌న్నిహితంగా మెలిగే మంత్రుల‌కు సంబంధించిన ప‌నులు కూడా అవ్వడం లేదట.

మిగ‌తా వారి మాదిరిగానే వీరూ సైలెంట్‌
దీంతో సీఎంకు అండగా నిలిచే ఆ ఇద్దరు, ముగ్గురు మంత్రులు కూడా మిగ‌తా వారి మాదిరిగానే సైలెంట్‌ అయిపోయారట. అన‌వ‌స‌రంగా విప‌క్షాల‌పై నోరు పారేసుకుని వారి దృష్టిలో కంటు కావ‌డం త‌ప్ప..ఏం ఉప‌యోగం లేద‌నుకున్నారట. అందుకే ఎగిరెగిరి దంచినా..ఎగ‌ర‌కుండా దంచినా అంతేనని సీఎంపై విపక్షాల విమర్శలను లైట్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శల‌కు మంత్రులు సైలెంట్‌గా ఉంటుండంతో చేసేది లేక‌.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయ‌నే రంగంలోకి దిగుతున్నారు. విప‌క్ష నేత‌ల‌ మాటలకు సీఎం రేవంతే కౌంట‌ర్‌ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది. లేదంటే ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిల‌య్య, ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌తో పాటు పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రమే ప్రెస్‌మీట్లు పెట్టి అపోజిషన్‌పై అటాక్ చేస్తున్నారు. గతంలో దీపాదాస్ మున్షి ఇంచార్జ్‌గా ఉన్నప్పుడు..ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి..మంత్రులు సీఎంగా అండగా ఉండేలా కొంత ప్రయత్నం చేశారు.

మీనాక్షి ఇంచార్జ్‌గా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట. అంతేకాదు రేవంత్‌కు రాహుల్‌ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని, అధిష్ఠానంతో ఆయనకు చెడిందనే ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు సీఎంను మరింత లైట్‌ తీసుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. రేవంత్‌ను అధిష్ఠానమే లెక్కచేయట్లేదని..తాము ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఏందన్న భావనలో మంత్రులు ఉన్నారా.? అనే డౌట్స్‌ వ్యక్తం అవుతున్నాయి. ఈ ప‌రిస్థితి మునుముందైనా మారుతుందా.. ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.