భార్య చివరి కోరిక తీర్చడానికి ఇండియాకు వచ్చాడు.. తిరిగి వెళ్తూ విమాన ప్రమాదంలో దుర్మరణం.. అనాథలైన ఇద్దరు పిల్లలు
తన పుట్టిన ఊరైన గుజరాత్‌లోని వాడియా గ్రామంలోని చెరువులో తన అస్థికలను కలపాలన్నది ఆమె చివరి కోరిక.

విధి ఇంత క్రూరంగా ఉంటుందా? ఒక నెల రోజుల క్రితం తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులకు ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యాడు. భార్య చివరి ఆశను నెరవేర్చేందుకు లండన్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ భర్త, తిరిగి తన పిల్లల దగ్గరకు వెళ్తూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ కుటుంబ గాధే ఇది.
అసలేం జరిగింది? ఆ 32 సెకన్లలోనే ఘోరం..
లండన్‌లో నివసించే అర్జున్ పాటోలియా భార్య భారతి ఇటీవల మరణించారు. తన పుట్టిన ఊరైన గుజరాత్‌లోని వాడియా గ్రామంలోని చెరువులో తన అస్థికలను కలపాలన్నది ఆమె చివరి కోరిక. ఆ కోరికను నెరవేర్చిన అర్జున్ జూన్ 13న తిరిగి లండన్‌లోని తన ఇద్దరు చిన్నారుల (8, 4 ఏళ్లు) వద్దకు బయలుదేరాడు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (అహ్మదాబాద్ నుండి లండన్) ఎక్కాడు. విమానం టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే ఘోరం జరిగింది. కేవలం 672 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరి, సాంకేతిక లోపంతో అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ సమీపంలోని ఒక భవనాన్ని ఢీకొని కుప్పకూలింది. అర్జున్ సహా విమానంలో ఉన్న 242 మందిలో (230 ప్రయాణికులు + 12 సిబ్బంది) 241 మంది మృతి చెందారు
ఒకే నెలలో అమ్మ, నాన్న దూరం.. అనాథలైన పసిపిల్లలు
ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. తల్లి మరణం నుంచి కోలుకోకముందే, తండ్రి కూడా శాశ్వతంగా దూరమవ్వడంతో లండన్‌లోని ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు అనాథలయ్యారు. వారి బాగోగులు ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆయన తన కుమారుడిని కలిసేందుకు లండన్ వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.