ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి, కానీ 7వేల మందికి ఒక్కరున్నారు… తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల కొరత, కారణాలు ఏంటి?

  • Publish Date - November 2, 2020 / 05:35 PM IST

doctors shortage: ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పేషెంట్స్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే.. వైద్యుల సంఖ్య మాత్రం అంతే ఉంటోంది. WHO రూల్స్‌ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఓ డాక్టర్‌ ఉండాలి.. కానీ.. రాష్ట్రంలో దాదాపు 7 వేల మందికి ఓ వైద్యుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి డాక్టర్ల కొరతకు గల కారణాలేంటి..? ఇంతకీ ఏ జిల్లాలో ఎంత మంది డాక్టర్లు ఉన్నారు..?

పేషెంట్స్ పెరుగుతున్నారు.. కానీ డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం పెర‌గ‌టం లేదు:
తెలంగాణలో ఒక‌ప్పుడు ప్రభుత్వాసుపత్రులంటే జ‌నం భ‌య‌ప‌డిపోయేవారు. కానీ క‌రోనా నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రులు కీలక పాత్ర పోషించ‌డంతో…కొంత‌వ‌ర‌కు ఈ ఆస్పత్రులపై ఉన్న రిమార్కులు తొలిగిపోయాయి. అందుకే నాన్ కోవిడ్ ఆస్పత్రుల‌కు కూడా ఓపీ విప‌రీతంగా వ‌స్తోంది. పేషెంట్స్ అయితే పెరుగుతున్నారు కానీ అందుకు త‌గ్గట్లుగా డాక్టర్లు, ఇత‌ర వైద్య సిబ్బంది మాత్రం పెర‌గ‌టం లేద‌నే ఆరోప‌ణ అలాగే ఉండిపోయింది.

దాదాపు 14 జిల్లాల్లో వందలోపే డాక్టర్లు, 15వేల మందికి ఒక్క డాక్టర్‌ కూడా లేని పరిస్థితి:
WHO నిబంధ‌న‌ల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి..కానీ మ‌న రాష్ట్రంలో 6 వేల 7వంద‌ల మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇక కొన్ని జిల్లాల్లో మాత్రం ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉన్నట్లు ఓ రిపోర్టులో వెల్లడైంది. అందులో ములుగు, నారాయ‌ణపేట్ స‌హా 14 జిల్లాల్లో డాక్టర్లు వందలోపే ఉన్నారు. ఆయా జిల్లాల్లో 15 వేల‌ మందికి ఒక్క డాక్టర్ కూడా లేరు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 5,637 మంది డాక్టర్లు:
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రస్తుతం మొత్తం 5 వేల 637 మంది డాక్టర్లు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలోనే వెయ్యి 762 మంది ఉన్నారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లాల్లో అత్యధికంగా 421 మంది డాక్టర్లు ఉన్నారు. ములుగులో అత్యల్పంగా 19మంది, నారాయణపేట్‌లో 21మంది మాత్రమే ఉన్నారు. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కొరతతో పాటు సౌక‌ర్యాలు కూడా స‌రిగ్గా లేకపోవడంతో ఉస్మానియా లాంటి పెద్ద దవాఖానాల్లోనూ ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా 2,407 డాక్టర్‌ పోస్టులు:
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో 2 వేల 407 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కీలకమైన టీచింగ్ ఆస్పత్రుల్లోనే వెయ్యి 359 మంది డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రులనే.. జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు అనుగుణంగా కొన్ని చోట్ల బెడ్ల సంఖ్యను పెంచారు. కానీ డాక్టర్లను మాత్రం నియమించ లేదు. ప్రస్తుతమున్న అవసరాలకు తగ్గట్లుగా కొత్త పోస్టులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండగా, ఇప్పటికే మంజూరైన పోస్టులను కూడా సర్కార్ భర్తీ చేయడంలో విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, జనరల్ సర్జరీ వంటి విభాగాల్లో డాక్టర్లపై ఒత్తిడి:
పేషెంట్స్ రద్దీ పెరిగి గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, జనరల్ సర్జరీ వంటి విభాగాల్లో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. సిజేరియన్ డెలివరీల శాతం పెరగడానికి గైనకాలజిస్టుల కొరత కూడా ఓ కారణమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డాక్టర్లు కోరుతున్నప్పటికీ, కేవలం కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వైపే సర్కార్ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న 5 వేల 637 మందిలో 500 మంది కాంట్రాక్ట్ డాక్టర్లే పనిచేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ కింద ప్రస్తుతం 331 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యూకేష‌న్ కింద టీచింగ్ ఆస్పత్రుల్లో వెయ్యి 359 పోస్టులు..తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలో 717పోస్టుల ఖాళీలున్నాయి. మరి ఈ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాలి.