Donkey Milk Scam (Photo Credit : Google)
Donkey Milk Scam : గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు అన్నాడు ఆనాడు వేమన. అప్పట్లో ఉన్న పరిస్థితిని బట్టి వేమన గాడిద పాలకు సరిగా విలువ కట్టలేకపోయారు. ఇప్పటి పరిస్థితుల్లో అంచనా వేసినట్లు అయితే.. గరిటెడైనను చాలు ఖరము పాలు అని పద్యాన్ని తిరగ రాసేవారేమో. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో గరిటెడు గంగిగోవు పాలక ధరకంటే.. గాడిద పాలకున్న విలువే ఎక్కువ. అయితే, ఈ విలువనే క్యాష్ చేసుకున్నారు చెన్నైకి చెందిన కొందరు కేటుగాళ్లు. గాడిద పాలకున్న డిమాండ్ ను ప్రచారం చేసి అన్నదాతలను నిండా ముంచేశారు. గాడిద పాల ఉత్పత్తి పేరుతో ఏకంగా రైతుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారు.
హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరుతో తమిళనాడులోని చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రైతులను మోసగించింది.
కరోనా నేపథ్యంలో ఎక్కువ పోషకాలు, రోగనిరోధక శక్తిని ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ.. చెన్నైలో తిరునల్వేలికి చెందిన బాబు, సుందర్, బాలాజీ, సోనికా రెడ్డి, డాక్టర్ రమేశ్ బృందం డాంకీ ప్యాలెస్ సంస్థను జూలై 23 2022లో ప్రారంభించింది. గాడిద పాలకున్న డిమాండ్ ను సోషల్ మీడియాలో సోనికా రెడ్డితో అనే యువతితో ప్రచారం చేయించారు. ఈ ప్రచారం చూసిన ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడుకు చెందిన 400 మంది రైతులు ఫ్రాంచైజీ మోడల్ లో గాడిదలను కొనుగోలు చేశారు. నిర్వాహకులు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఒక్కో పాడి గాడిదను రైతులు రూ.80వేల నుంచి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటర్ కు రూ.1600 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తామని రైతులతో ఒప్పందం చేసుకుంది డాంకీ ప్యాలెస్ సంస్థ.
అయితే, మొదటి 3 నెలల పాటు రైతులకు లీటర్ గాడిద పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేసి వారిలో నమ్మకం కలిగించింది. తర్వాత 18 నెలల నుంచి కాలయాపన చేస్తూ వస్తోంది. డాంకీ ప్యాలెస్ సంస్థకు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స డబ్బుల కోసం ఎప్పటికప్పుడు నిలదీస్తే.. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ మాట దాట వేస్తూ వచ్చింది. మరోసారి డాంకీ ప్యాలెస్ సంస్థ నిర్వాహకులను రైతులు నిలదీయగా.. ఒక్కొక్కరికి రూ.15లక్షల నుంచి రూ.70లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు. అవి బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తెలంగాణకు చెందిన రైతులు.. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తమ ఆవేదనను వెళ్లగక్కారు.
”గాడిదలను కొనాలని కండీషన్ పెట్టలేదు. మీరే ఎక్కడైనా గాడిదలను తెచ్చుకోండి, పాలను మాత్రమే మాకు ఇవ్వండి అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుస్తూ పోయారు. తొలుత 3 నెలలు అందరికీ డబ్బులు బాగానే ఇచ్చారు. మోసపోయిన వారిలో చాలామంది చదువుకున్న వారున్నారు. ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. గాడిదల ఫార్మ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అని సంకోచిస్తున్నారు. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు” అని బాధితురాలు ఒకరు తెలిపారు.
ఫ్రాంచైజీ మోడల్ లో గాడిద పాలను తీసుకుని డాంకీ ప్యాలెస్ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఎగవేసిందని బాధిత రైతులు వాపోయారు. తమను నమ్మించి నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు.
”2023 జనవరిలో మా ఫార్మ్ ఓపెన్ అయ్యింది. 3 నెలల బాబు అనే వ్యక్తి డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికీ డబ్బులు ఇచ్చారు. ఎంత పాలు ఇచ్చారో అంత డబ్బులు వేశారు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫార్మ్ యజమానుల ద్వారా యూట్యూబ్ లో ప్రచారం చేయించారు. గాడిద పాల ద్వారా నెలకు రూ.10లక్షలు సంపాదించవచ్చని అమాయక రైతులను మోసం చేశారు. ఈ ఊబిలోకి దింపి ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు” అని బాధితుడు ఒకరు తెలిపారు.
డాంకీ ప్యాలెస్ సంస్థ మోసంపై చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం సందర్భంగా డాంకీ ప్యాలెస్ సంస్థ తమకు ఇచ్చిన జీఎస్టీ సంఖ్య, FSSAI లైసెన్స్ కూడా నకిలీవే అని తేలిందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యం అని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read : డబుల్ గోల్డ్ స్కీమ్ స్కామ్.. ప్రతి నెల 4శాతం లాభం అంటూ రూ.300 కోట్లు కొట్టేసిన కేటుగాడు..