Drink adulterous liquor Three killed in Vikarabad : వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలలంలోని చిట్టిగిద్ద గ్రామంలో.. కల్తీ కల్లు ముగ్గురి ప్రాణాలు తీసింది. చిట్టిగిద్ద గ్రామంతో పాటు అర్కతల, వట్టిమీనపల్లి, కేశపల్లి, తిమ్మారెడ్డి గ్రామాల్లోనూ కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంలో ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందుతూనే చనిపోయారు.
బాధితులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరామర్శించారు. ఆ గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తయ్యారు. ఏయే గ్రామాల్లో అయితే ప్రజలు అస్వస్థతకు గురయ్యారో అక్కడున్న కల్లు దుకాణాలను సీజ్ చేశారు. కల్లును సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ప్రజలు అస్వస్థతకు గురవడానికి గల కారణాలపై దృష్టి సారించారు.
కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందడం, 30 మంది అస్వస్థతకు గురికావడంతో ఆ గ్రామాల ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో కల్లు తాగొద్దంటూ డప్పుతో చాటింపు వేయించారు. ఒకవేళ కల్లు ఉంటే దాన్ని పారబోయాలని, తాగొద్దని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.