పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి సూచించారు.పుల్వమా దాడి మూలాలు పాక్ లో ఉన్నాయన్నారు. ఈ దాడే మొదటిది కాదని, గతంలో ఉరీ,పఠాన్ కోట్,ఉరీ వంటి అనేక ఘటనలు జరిగాయని అన్నారు. పాక్ ప్రభుత్వం,ఆర్మీ,ఐఎస్ఐ కలిసే పుల్వామా దాడి జరిపాయన్నారు.
ఓ మహమ్మద్..వ్యక్తి ప్రాణాలు బలితీసుకోడని, జైషే మహమ్మద్ సంస్థను జైషే సైతాన్ గా ఆయన అభివర్ణించారు. భారత్ లోని దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అని ఓ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ధీటైన జవాబిచ్చిన ఓవైసీ..భారత్ లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్, దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయన్నారు. భారత్ గురించి పాక్ కు తెలియదని,ఇక్కడి ప్రజలు బతికున్నంతకాలం కలిసే ఉంటారని అన్నారు. దీన్ని పాక్ ఓర్వలేకపోతుందన్నారు.భారత ముస్లింల గురించి పాక్ ఆలోచించనవసరం లేదన్నారు.1947లో భారత్ ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు.