Eatala Rajender: కేసీఆర్‌కి అటు ఎన్డీఏలో, ఇటు ఇండియాలో చోటు దక్కలేదు.. అందుకే ఇలా చేయొద్దు: ఈటల

డబ్బులు, అధికారం ఉన్నాయని మిడిసి పడవద్దని అన్నారు.

Eatala Rajender

Eatala Rajender – KCR: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ పరిస్థితి ఎటూ కాకుండా తయారైందని విమర్శించారు. ఆయనకు ఎవరి మద్దతూ దక్కడం లేదని, ఒంటరిగా మిగిలిపోయారని చెప్పారు. స్థాయిని మరిచి ఎగిసిపడితే ఇటువంటి ఫలితాలే వస్తాయని విమర్శించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ ది ఏ కూటమో చెప్పాలని డిమాండ్ చేశారు.

పాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు పేరుతో ఇతర రాష్ట్రాల్లోనూ ఊరేగుతున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు సరైన పాలన అందించే సమర్థత లేదు కానీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తామని అంటున్నారని విమర్శించారు. కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తియ్యడానికి పోయినట్టు ఉందని ఎద్దేవా చేశారు.

విమానాల్లో అన్ని పార్టీల దగ్గరికి పోయారని, తనను నాయకుడిని చేయాలని దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేస్తానని చెప్పి వచ్చారని అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ ను ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. అటు బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటమి నమ్మక ఎటూ కాకుండా పోయారని చెప్పారు.

చివరికి ఆయనను తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదని అన్నారు. డబ్బులు, అధికారం ఉన్నాయని మిడిసి పడవద్దని అన్నారు. కేసీఆర్ పాలనకు పోయేకాలం వచ్చిందని చెప్పారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని తమ పార్టీ హైకమాండ్ ను కోరుతామని ఈటల రాజేందర్ అన్నారు.

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఫుల్,కొత్తగా నేతలు చేరాల్సిన అసవరం లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి