Eetala Resignation: ఈటల రాజీనామా – టీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు

Eetela (2)
Eetala Resignation: టీఆర్ఎస్ పార్టీలో తాను భంగపడ్డానంటూ.. విమర్శలను, అవమానాలను తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈటల రాజేందర్. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనపై ఇటీవల అక్రమాస్తులు ఉన్నాయంటూ నేరారోపణలు వినిపించాయి. కొద్ది రోజులుగా పార్టీకి దూరం అవుతారని జరుగుతున్న ప్రచారం నిజమైంది. గురువారం హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో రాజీనామాను ప్రకటించారు.
మీడియా సమావేశం ఏర్పాటు చేసి 19ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా గెలిచినట్లు గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన… బతికి ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసిందని వాపోయారు. సీఎంకు తనకు మధ్య ఐదేళ్ల క్రితమే గ్యాప్ ఉందని.. మంత్రి హరీష్ రావుకు కూడా ఇవే అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా అయిందని మండిపడ్డారు. ప్రగతిభవన్‌ను బానిస నిలయంగా మార్చుకోవాలని అన్నారు.
కేసీఆర్ అప్పుడలా.. ఇప్పుడిలా
‘అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు. అప్పుడు కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు.
ఆర్థిక మంత్రి లేకుండా
ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా? ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు.
పేద రైతులకు మాత్రమే డబ్బులిమ్మంటే
నేనే పథకాన్ని విమర్శించలేదు. రైతుబంధు గురించి కొన్ని సూచనలు చేశా. ఆదాయపన్ను కట్టే వారికి రైతు బంధు ఇవ్వొద్దని చెప్పా. వ్యవసాయం చేయని వారి డబ్బులను పేద రైతులకు ఇస్తే బాగుంటుందని సూచించా. అదేమైనా తప్పా?
నెక్స్ట్ ఏంటి?
ఈటల రాజీనామా తర్వాత బీజేపీ కండువా కప్పుకుంటారనే వార్త బాహాటంగానే చక్కర్లు కొడుతోంది. దీనిపై మాత్రం ఈటల క్లారిటీ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది అంటున్నారు. అదే జరిగితే ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, ఈటల ప్రధాన అనుచరుడు సమ్మిరెడ్డి… కాషాయదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
ఎప్పుడు జరగొచ్చు:
గురువారం ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసొచ్చిన ఈటల రాజేందర్.. స్థానికంగా ఉన్న పెద్ది రెడ్డి లాంటి నాయకులతోనూ ఫోన్లలో మాట్లాడారట. ఈటల చేరికపై చిన్నబుచ్చుకున్నారని తెలియడంతో డీకే అరుణ లాంటి వాళ్లు బుజ్జగింపులకు వెళ్లారు. ఈటల ఫోన్లో మాట్లాడిన తర్వాత ముందుగా తనకు సమాచారం ఇవ్వకపోవడంపై మాత్రమే అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారట. ఇక అన్నీ మంతనాలు పూర్తయ్యాక 11వ తేదీ తర్వాతే కమల పార్టీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల వినికిడి.