Palamuru-Ranga Reddy lift scheme
Palamuru-Ranga Reddy Environmental Clearance : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్ పర్ట్ అడ్వైజర్ కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు సిఫారసు చేసింది. దీంతో ఇక అనుమతులు లాంఛనప్రాయం కానున్నాయి. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 34వ ఈఏసీ సమావేశం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా 49వ సమావేశంలో అనుమతులు లభించాయి.
పాలమూరు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. ఈ ప్రాజెక్టు దశాబ్దాల స్వప్నమని చెప్పారు. పర్యావరణ అనుమతులకు ఈఏసీ ఆమోదం హర్షనీయం అన్నారు. పథకం తొలి దశ పనులకు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, ఎన్నో అడ్డంకులను అధిగమించిందని చెప్పారు. పోరాడి అనుమతులను సాధించామని తెలిపారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. ఇలా రూ.59కే సిటీ అంతా తిరిగేయండి..
ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత చారిత్రక విజయం అన్నారు. దీనిపై మంత్రి హరీశ్ రావు ట్విటర్ లో స్పందించారు. దశాబ్ధాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగు పరుగున రానుందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధించడం కేసీఆర్ ఘనత అని కొనియాడారు. కేసీఆర్ మొక్కవోని దీక్షకు ఇదే నిదర్శనం అన్నారు. ప్రభుత్వం పట్టువీడని ప్రయత్నం తోడై సాధించిన ఫలితం ఇది అన్నారు. ఇది మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని చెప్పారు.