త్వరలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోతుంది: ఎర్రబెల్లి దయాకర్ రావు

తనను ఓడించిన పాపానికి పాలకుర్తి ప్రజలు ఏడుస్తున్నారని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.

బీజేపీ త్వరలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టబోతుందని తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కాంగ్రెస్ సర్కారుని తాము పడగొట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇవాళ ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని, కాంగ్రెస్ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదని తెలిపారు.

తెలంగాణ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను దోచుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం దివాలా తీసిందని తెలిపారు. తన అనుభవంతో చెబుతున్నానని, కేవలం రెండేళ్లలో ఆర్టీసీ దివాలా తీయడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాలు విసిరారు.

రాజకీయాల్లో కడియం శ్రీహరిని మించిన ద్రోహి ఎవరూ లేరని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తాను ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. ఏడుసార్లు గెలిచిన చరిత్ర తనకు ఉందని చెప్పారు. ఒక్కసారి మాత్రమే ఓడిన తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

తనను ఓడించిన పాపానికి పాలకుర్తి ప్రజలు ఏడుస్తున్నారని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. నాలుగుసార్లు ఓడిపోయిన కడియం శ్రీహరికి తన గురించి మాట్లాడడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి జీవిత చరిత్రను త్వరలోనే బయటపెడతానని చెప్పారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్

ట్రెండింగ్ వార్తలు