Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao- Junior Panchayat Secretaries : పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం అన్నారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సెక్రటేరియట్ లో మంత్రి ఎర్రబెల్లి మట్లాడారు. జూ.సెక్రటరీల రెగ్యులరైజ్ పై కీలక వ్యాఖ్యలు చేశారాయన. పంచాయతీ జూనియర్ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసేందుకు కమిటీ వేశారని చెప్పారు. ఆ కమిటీ నివేదిక రాగానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
పంచాయతీ జూనియర్ సెక్రటరీల రెగ్యులరైజ్ పై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. ఇచ్చిన మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత హరీశ్ రావు, నేను, చీఫ్ సెక్రటరీ సమావేశం అయ్యామన్నారు.(Errabelli Dayakar Rao)
రేపు(మే 23) మరోసారి సమావేశం అవుతామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ జూనియర్ సెక్రటరీల రెగ్యులరైజ్ విధివిధానాలు, గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
జేపీఎస్‌ల రెగులరైజ్, విధివిధానాల ఖరారుకు కేసీఆర్ ఆదేశం:
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉన్నతాధికారులతో జేపీఎస్ ల క్రమబద్దీకరణ అంశంపై చర్చించిన సీఎం కేసీఆర్.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు:
జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదా శాఖాధిపతి స్థాయి అధికారి.. జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. జేపీఎస్ ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.(Errabelli Dayakar Rao)
ప్రభుత్వ హామీతో సమ్మె విరమణ:
అటు తెలంగాణలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రతిపాదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు. ఆ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్ ల భర్తీ ప్రక్రియ, క్రమబద్దీకరణ తదుపరి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, జేపీఎస్ లు తమ ప్రొబేషన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో రెగ్యులరైజ్ చేయాలని కొంతకాలం పాటు సమ్మె చేపట్టారు. అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జేపీఎస్ ల సర్వీస్ ను క్రమబద్దీకరించాలని నిర్ణయించింది.(Errabelli Dayakar Rao)
ఆ నివేదిక రాగానే రెగ్యులరైజ్:
జేపీఎస్ లను రెగులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జేపీఎస్ ల రెగ్యులరైజ్ కు కమిటీ వేశారని, కమిటీ నివేదిక రాగానే క్రమబద్దీకరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అటు ప్రభుత్వ నిర్ణయంపై జేపీఎస్ లు హర్షం వ్యక్తం చేశారు.