Nizamabad Rural Constituency: బాజిరెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారా.. నిజామాబాద్ రూరల్‌లో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్?

నిజామాబాద్ లో రూరల్ విపక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులెవరు? బాజిరెడ్డి గోవర్దన్.. ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? ఈసారి.. నిజామాబాద్ రూరల్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

Nizamabad Rural Constituency: బాజిరెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారా.. నిజామాబాద్ రూరల్‌లో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్?

Nizamabad Rural Assembly constituency :  నిజామాబాద్ రూరల్.. గులాబీ పార్టీకి కంచుకోట. అలాంటి కోటలో.. పాగా వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు.. గట్టిగా ప్రయత్నిస్తున్నాయ్. దాంతో.. ఈసారి రూరల్‌లో పోటాపోటీ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ (Bajireddy Goverdhan )కు ఉన్న మాస్ లీడర్ ఇమేజ్‌తో.. మరోసారి ఆయన గెలుపు ఖాయమనే చర్చ బీఆర్ఎస్ (BRS Party) వర్గాల్లో వినిపిస్తోంది. కానీ.. ఈసారి గులాబీ పార్టీకి చాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ డిసైడ్ అయ్యాయ్. దాంతో.. రూరల్‌లో ట్రయాంగిల్ ఫైట్ తప్పదంటున్నారు. మరి.. విపక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులెవరు? బాజిరెడ్డి గోవర్దన్.. ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? ఈసారి.. నిజామాబాద్ రూరల్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?

నిజామాబాద్ రూరల్‌ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను చూసేముందు.. అక్కడి పొలిటికల్ హిస్టరీ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. ఈ రూరల్ సెగ్మెంట్.. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడింది. అంతకుముందు.. ఈ ప్రాంతం డిచ్‌పల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో.. మొత్తం ఏడు మండలాలున్నాయి. అవి.. నిజామాబాద్ రూరల్, జక్రాన్ పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, డిచ్‌పల్లి, దర్పల్లి. వీటి పరిధిలో మొత్తం లక్షా 94 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో మున్నూరుకాపు(munnuru kapu) సామాజికవర్గంతో పాటు దళిత, గిరిజన, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొదట్లో.. ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ తొలిసారి పసుపు పార్టీ జెండానే ఎగిరింది. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు గెలిచారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లో గులాబీ పార్టీ జెండానే ఎగురుతూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Bajireddy Govardhan

బాజిరెడ్డి గోవర్దన్‌ (Photo: Facebook)

నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. ఆయన గతంలో.. ఆర్మూరు, బాన్సువాడ నుంచి కూడా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు రూరల్ నుంచి గెలిచి.. ఈ ప్రాంతంపైనా తన పట్టు ఎంతుందో అందరికీ అర్థమయ్యేలా చేశారు. అలాంటి బాజిరెడ్డి గోవర్దన్‌కు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదనే ప్రచారం జరుగుతోంది. వయసురీత్యా ఈసారి తన కొడుకుని ఎన్నికల బరిలో దించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాజిరెడ్డి గోవర్దన్ కుమారుడు జగన్ జడ్పీటీసీగా ఉన్నారు. ఇప్పటికే.. అతను జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. గోవర్దన్ తనయుడు జగన్‌కు గనక.. బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇస్తే.. తండ్రి స్థాయిలో గెలిచేంత సానుకూలత లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికున్న సర్వేల ప్రకారం.. మళ్లీ బాజిరెడ్డి గోవర్దన్ బరిలో దిగితేనే.. విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు.

ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్.. కొన్నాళ్లుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల పాల్గొనడం, క్యాడర్‌ని కలవడంతో పాటు జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిగతా ఈవెంట్లకు కూడా హాజరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. జనానికి అందుబాటులో ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ.. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లో మళ్లీ గులాబీ పార్టీ జెండానే ఎగురుతుందని ధీమాగా ఉన్నారు.

Rekulapally Bhoopathi Reddy

రేగుళపల్లి భూపతిరెడ్డి (Photo: Facebook)

కాంగ్రెస్ విషయానికొస్తే.. మాజీ ఎమ్మెల్సీ రేగుళపల్లి భూపతిరెడ్డి (Rekulapally Bhoopathi Reddy) టికెట్ ఆశిస్తున్నారు. ఈయన గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి.. అనర్హత వేటుకు గురయ్యారు. ఈసారి రూరల్‌లో పోటీ చేసి.. ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. భూపతిరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీకి సై అంటుండటంతో.. పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈ వర్గ పోరు.. హస్తం పార్టీకి ఎలాంటి నష్టం చేస్తుందన్నదే ఆసక్తిగా మారింది. టికెట్ దక్కని నాయకులు.. పోటీ చేసే అవకాశం వచ్చిన అభ్యర్థికి మద్దతుగా పనిచేస్తారా? లేదా? అన్నదే.. బిగ్ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా.. ఈసారి నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.

Dinesh Kumar Kulachari

దినేశ్ కుమార్ కులాచారి (Photo: Facebook)

ఇక.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్నా.. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. కాషాయం పార్టీ నుంచి దినేశ్ కుమార్ కులాచారి (Dinesh Kumar Kulachari) బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన ఒకప్పుడు బాజిరెడ్డి గోవర్దన్‌కు శిష్యుడు కూడా. ఈసారి.. రూరల్‌లో బీజేపీనే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కారు స్పీడ్‌కి బ్రేకులు పడతాయా.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది?

ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. మంచిప్ప రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. అలాగే.. అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తామని చెప్పి.. ఒక్క బీబీపూర్ తండాలో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారంటున్నారు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు హామీని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక విపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు జరగడం లేదని.. రెండు పార్టీల క్యాడర్ గుర్రుగా ఉంది. వీటిని.. ఆ పార్టీల నాయకులు ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. అధికార బీఆర్ఎస్‌కు.. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దనే బలం. ఆయన కూడా పూర్తిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, కేసీఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలనే నమ్ముకొని ఉన్నారు.

Also Read: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా?

బీజేపీకి.. బలమైన అభ్యర్థి లేకపోవడం కొంత మైనస్‌గా చెబుతున్నారు. కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరు.. పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఇవన్నీ.. మళ్లీ అధికార పార్టీకే ప్లస్ అవుతాయని చెబుతున్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అంత దూకుడుగా ఉండకపోవడం కూడా బాజిరెడ్డికి అదనపు బలంగా మారుతోందనే టాక్ ఉంది. అయితే.. బాజిరెడ్డి గోవర్దన్ ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారా? తనయుడిని బరిలో దించుతారా? అనేది ఆసక్తిగా మారింది. ఆయన కాకుండా కుమారుడు పోటీ చేస్తే.. రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.