Warangal West Constituency: కారు స్పీడ్‌కి బ్రేకులు పడతాయా.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది?

గులాబీ పార్టీకి.. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయ్ ప్రతిపక్షాలు. మరి.. కారు స్పీడ్‌కి బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీనేంటి?

Warangal West Constituency: కారు స్పీడ్‌కి బ్రేకులు పడతాయా.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది?

Warangal West Assembly Constituency: రెండు జిల్లాల కలెక్టరేట్లకు కేంద్రం. ఎన్నో ప్రజా పోరాటాలకు కేరాఫ్. అత్యధిక విద్యావంతులు కలిగిన అసెంబ్లీ సెగ్మెంట్. నియోజకవర్గం మొత్తం అర్బన్ ఏరియా. అదే.. వరంగల్ వెస్ట్. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి.. గులాబీ దళానికి దన్నుగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో.. రాజకీయం రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. వరుసగా నాలుగు సార్లు జెండా ఎగరేసిన గులాబీ పార్టీకి.. ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయ్ ప్రతిపక్షాలు. మరి.. కారు స్పీడ్‌కి బ్రేకులు వేయడం సాధ్యమవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది? ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమంలో కనిపించబోయే సీనేంటి?

Dasyam, Naini, Rao Padma

వినయ్ భాస్కర్, రాజేందర్ రెడ్డి, రావు పద్మ (Photos: Facebook)

వరంగల్ వెస్ట్.. గులాబీ పార్టీకి కంచుకోట. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. హన్మకొండ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పీవీ నరసింహారావు (PV Narasimha Rao) ప్రధానిగా ఉన్న సమయంలో.. ఆయన కుమారుడు పీవీ రంగారావు.. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించేవారు. ఉమ్మడి ఏపీలో.. మంత్రిగానూ కీలక భూమిక పోషించారు. అంతటి పీవీ తనయుడు రంగారావును.. తెలుగుదేశం హవాతో ఓడించి.. సంచలన విజయం సాధించారు దాస్యం ప్రణయ్ భాస్కర్ (Dasyam Pranay Bhasker). ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కినా.. అనారోగ్య కారణాలతో ప్రణయ్ భాస్కర్ మృతి చెందారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో.. ప్రణయ్ భాస్కర్ సతీమణి సబిత భాస్కర్ బరిలో దిగగా.. ఆమెపై మళ్లీ పీవీ రంగారావు విజయం సాధించారు. ఈ ప్రాంతం నుంచి గెలిచిన వారిలో.. ప్రణయ్ భాస్కర్ సహా హయగ్రీవాచారి, పీవీ రంగారావు మంత్రి పదవులు నిర్వహించారు. 2004 ఎన్నికల్లో.. తొలిసారి ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగిరింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన మందాడి సత్యనారాయణ రెడ్డి.. అసమ్మతి నేతగా కొనసాగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతిచ్చి.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటుకు గురయ్యారు. రాష్ట్ర చరిత్రలో.. తొలిసారి అనర్హత వేటు పడిన 9 మందిలో మందాడి సత్యనారాయణ రెడ్డి ఒకరు.

వరంగల్ (Warangal), హన్మకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని.. వరంగల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని.. వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ పేరుతో.. రెండు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. పునర్విభజనకు ముందు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక భాగం ఉన్న ఓటర్లను.. ప్రస్తుత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కలిపారు. వరంగల్ నగరంలోని.. కాజీపేట, హన్మకొండ, న్యూశాయంపేట, వరంగల్ ప్రాంతంలోని మట్టెవాడ, రంగంపేట లాంటి ప్రాంతాలు.. వరంగల్ వెస్ట్ పరిధిలోకి వచ్చేశాయి. నియోజకవర్గ పునర్విభజన తర్వాత.. హన్మకొండకు బదులుగా.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పురుడు పోసుకుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో.. 2 లక్షల 66 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. అత్యధికంగా విద్యావంతులున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో.. వరుసగా గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. 2004లో మందాడి సత్యనారాయణ గెలిస్తే.. ఆ తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

Dasyam Vinay Bhaskar

దాస్యం వినయ్ భాస్కర్ (Photo: Facebook)

తెలంగాణలోనూ.. ఉద్యమ సమయంలోనూ.. అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం వరంగల్ పశ్చిమం (Warangal West Constituency). ఇక్కడ.. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్.. మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు పార్టీలోనూ.. ఇటు నియోజకవర్గంలోనూ తిరుగులేని నేతగా ఎదిగి.. వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నారు వినయ్ భాస్కర్. ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్‌ పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. వరుసగా గెలుస్తూ రావడం, ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత మినహా.. మరే రకంగానూ.. వినయ్ భాస్కర్‌కు అంతగా ప్రతికూల పరిస్థితులు లేవనే చెప్పొచ్చు. అయితే.. ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మరోసారి బరిలో దిగడం దాదాపు ఖాయమననే చర్చ కూడా లోకల్‌గా సాగుతోంది.

Also Read: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక భద్రకాళి బండ్, 33 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీజినల్ సైన్స్ సెంటర్, పార్కులు, జంక్షన్లు, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌తో.. వరంగల్ వెస్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం హబ్‌గా మారిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలే తనను మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఇక.. విభజన హామీల్లో ప్రధానమైన కోచ్ ఫ్యాక్టరీ, చారిత్రక వేయిస్తంభాల ఆలయ మంటపం (Thousand Pillar Temple) పునర్నిర్మాణం నిధుల విషయంలో విమర్శలున్నా.. అవి కేంద్రం పరిధిలో ఉండటంతో.. వాటి జాప్యానికి కేంద్రమే కారణమని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు వినయ్ భాస్కర్.

Naini Rajender Reddy

నాయిని రాజేందర్ రెడ్డి (Photo: Facebook)

అధికార పార్టీపై ఉండే సహజ వ్యతిరేకత మీదే.. కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలో రెడ్డి ఓటర్ల ప్రభావం అధికంగా ఉంటుందని.. అది పార్టీకి, అభ్యర్థికి బలంగా మారి బీఆర్ఎస్‌పై విజయం సాధించడం సులువవుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ అడుగులేస్తోంది. కానీ.. కాంగ్రెస్‌లో టికెట్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. టికెట్ రేసులో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) ముందున్నారు. ఇదే సీటుపై.. జనగామ డీసీసీ మాజీ ప్రెసిడెంట్ జంగా రాఘవ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో తానే బరిలోకి దిగుతానని ప్రకటించడం.. కాంగ్రెస్ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. అదేవిధంగా.. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ (Swarna Errabelli) కూడా నియోజకవర్గంలో కొంత అనుచరగణాన్ని కలిగి ఉండటంతో.. ఆవిడ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేత మధ్య నెలకొన్న రాజకీయ విబేధాలు తమకు కలిసొస్తాయనే అంచనాలో ఉంది రేవంత్ వర్గం. దాంతో.. రేవంత్‌కు సన్నిహితుడిగా పేరున్న.. వేం నరేందర్ రెడ్డి పేరు తెరమీదికొస్తోంది. ఈ పరిస్థితుల మధ్య.. నలుగురు నేతల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.

Rao-Padma

రావు పద్మ(Photo: Facebook)

నియోజకవర్గంలో అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండటం, రాష్ట్రంలో బీజేపీకి జోష్ రావడంతో.. కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలో ఉంది కమలదళం. బీజేపీ నాయకత్వం.. ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాంతో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. ఈసారి.. కచ్చితంగా ప్రజలు తమకే అవకాశం ఇస్తారనే ధీమాతో ఉన్నారు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ(Rao Padma). ఇప్పటికే ఆవిడ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ని ఓడించేందుకు.. వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు సైతం.. కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కి సన్నిహితంగా ఉన్న మరో నేత రాకేశ్ రెడ్డి కూడా.. టికెట్ తనకేనన్న ధీమాతో ఉన్నారు. కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేసే పరిణామాలు.. బీజేపీలో చోటు చేసుకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని.. ఈసారి బీజేపీ తరఫున బరిలో దించేలానే ఆలోచనతో.. రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. నర్సంపేటపై ఆశలు పెట్టుకున్న రేవూరిని.. పశ్చిమానికి మార్చి.. నర్సంపలేటలో కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బరిలోకి దించితే.. రెండు చోట్లా గెలిచే అవకాశముంటుందనే లెక్కల్లో కమలనాథులున్నారు.

Also Read: రసవత్తరంగా వనపర్తి లోకల్ పాలిటిక్స్.. కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

ఏదేమైనా.. వరంగల్ వెస్ట్‌పై.. తమ పార్టీ జెండా ఎగరేసేందుకు.. అధికార బీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయ్. అందుకు తగ్గట్లుగానే.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయ్. దాంతో.. ఇక్కడ.. ట్రయాంగిల్ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. వరుసగా.. ఐదోసారి విజయం ఖాయమనే ధీమాతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఇక్కడ.. కారు పార్టీ స్పీడుకు బ్రేకులు వేయడం అంత కష్టమేమీ కాదనే ధీమాలో.. బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. దాంతో.. రాబోయే ఎన్నికల్లో.. జిల్లాలోనే.. వరంగల్ వెస్ట్.. హాట్ సీటుగా మారనుంది.