Kothagudem Constituency: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్‌లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?

Kothagudem Constituency: కొత్తగూడెంలో హీటు రేపుతోన్న పొలిటికల్ టెంపరేచర్.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్ అదే!

kothagudem assembly constituency: అధికార బీఆర్ఎస్ నుంచి నలుగురు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు.. సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అన్నీ కుదిరితే.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదీ.. ఇప్పటివరకు కొత్తగూడెం సీటులో.. పోటీకి రేసులో ఉన్న పేర్లు. ముందు ముందు ఇంకొందరు నేతలు.. ఈ లిస్టులో చేరొచ్చు. ఇప్పటికే.. కొత్తగూడెంలో పొలిటికల్ టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. అధికార పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికొస్తుందన్నదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్. ఇక.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోయేదెవరన్నది కూడా ఆసక్తి రేపుతోంది. పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్‌లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?

Ponguleti, Vanama, Yadavalli
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విలక్షణమైన తీర్పు వచ్చేది కొత్తగూడెంలోనే. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. రాజకీయాలు రసవత్తరంగా మారాయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు సెగ్మెంట్లలో.. ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానం కావడంతో.. ఈ నియోజకవర్గం హాట్ సీటుగా మారిపోయింది. కీలక నేతల ఫోకస్ అంతా ఇప్పుడు కొత్తగూడెం మీదే ఉంది. ఇందుకు అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహుల లిస్టే.. బిగ్ ఎగ్జాంపుల్. కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ 1978లో ఏర్పాటైంది. అంతకముందు పాల్వంచలో భాగంగా ఉండేది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. టీడీపీ నుంచి 1983, 1985లో కోనేరు నాగేశ్వరరావు విజయం సాధించారు. 1989లో.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో మళ్లీ కోనేరు నాగేశ్వరరావు గెలిచారు. 1999, 2004లో వనమా వెంకటేశ్వరరావు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు.. వనమాపై గెలిచారు.

2014లో తొలిసారి కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగిరింది. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ గెలిచిన ఒకే ఒక్క సీటు కొత్తగూడెం. 2018 ఎన్నికల్లో మాత్రం తిరిగి కాంగ్రెస్ జెండా ఎగిరింది. జలగం వెంకట్రావుపై.. వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆయన కారెక్కేశారు. కొత్తగూడెం నియోజకవర్గానికి.. పదిసార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ కలిసి నాలుగు సార్లు, జనతా పార్టీ ఒకసారి, టీడీపీ మూడు సార్లు, సీపీఐ, టీఆర్ఎస్ ఒక్కోసారి విజయం సాధించారు. టీడీపీ తరఫున మూడు సార్లు గెలిచిన కోనేరు నాగేశ్వరరావు.. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కొత్తగూడెం నుంచి నాలుగు సార్లు గెలిచిన.. వనమా వెంకటేశ్వరరావు.. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

కొత్తగూడెం పరిధిలో 5 మండలాలున్నాయి. అవి.. పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం. నియోజకవర్గంలో 2 లక్షల 28 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. 80 శాతం పైనే పోలింగ్ నమోదవుతుంది. ఇక్కడి కాపుల ఓట్ బ్యాంక్ 30 వేలకు పైనే ఉంది. అలాగే.. యాదవులు 22 వేలు, ముస్లింలు 28 వేల దాకా ఉన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం కావడంతో.. పల్లె ఓటర్లతో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోనూ ఓటర్లు అధికంగానే ఉన్నారు.

Vanama Venkateswara Rao

వనమా వెంకటేశ్వరరావు (Photo: Facebook)

ప్రస్తుతం కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateswara Rao) ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత.. గులాబీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికే.. ఆయన జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకి.. ఆయన కుమారుడు వనమా రాఘవ (Vanama Raghava) వివాదాల వ్యవహారం మైనస్‌‍గా మారే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దాంతో.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని అంటున్నారు.

Gadala Srinivasa Rao

డాక్టర్ గడల శ్రీనివాసరావు (Photo: Twitter)

ఇక.. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌గా కొనసాగుతున్న డాక్టర్ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) కూడా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో.. కొత్తగూడెంలో పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. వివిధ సేవా కార్యక్రమాలతో.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన అనుచురులు సైతం.. టికెట్ గడల శ్రీనివాసరావుదేనని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇలా.. అధికార బీఆర్ఎస్‌లో.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉంది.

Also Read: లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతున్న రామగుండం రాజకీయాలు!

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి కొత్తగూడెం ప్రజల్లో మంచి పేరే ఉన్నా.. ఆయన కుమారుడు వనమా రాఘవ వివాదాల కారణంగా.. కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. వనమా సామాజికవర్గం నుంచే గడల శ్రీనివాసరావు కూడా టికెట్ రేసులో ఉండటంతో.. రాజకీయంగా లెక్కలు మారే చాన్స్ ఉందంటున్నారు. పైగా.. సీఎం కేసీఆర్ (CM KCR) ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారు. పార్టీ బలం, సామాజికవర్గం బలంతో పాటు ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, సిబ్బంది అంతా ఆయన గెలుపు కోసం కృషి చేస్తారని.. అనుచరులు చెబుతున్నారు.

Jalagam Venkat Rao

జలగం వెంకట్రావు (Photo: Twitter)

ఇక.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (Jalagam Venkat Rao) గనక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే.. ఆయన గెలవడం సులువనే చర్చ జరుగుతోంది. ఇందుకు.. గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులే కారణమంటున్నారు. మంచి నాయకుడనే పేరుతో పాటు కొత్తగూడెంపై వెంకట్రావుకు గట్టి పట్టు ఉంది. అయితే.. ఆయన స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండరనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు.. జలగం వెంకట్రావు అనుచరుల పెత్తనం వల్లే.. గత ఎన్నికల్లో ఓటమికి కారణమైందనే టాక్ ఉంది. దీనికితోడు.. త్వరలోనే పార్టీ మారతారనే ప్రచారం కూడా పెద్ద మైనస్‌గా మారింది. పొత్తులో భాగంగా.. సీటు మరో పార్టీకి వెళితే.. మరో పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ బలంగానే కనిపిస్తోంది. నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అత్యధిక స్థానాలను గెల్చుకుంది. అయినప్పటికీ.. మాజీ ఎంపీ పొంగులేటి రూపంలో గట్టి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఆయన అనుచరులంతా.. పొంగులేటి కొత్తగూడెం నుంచే పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు. పొంగులేటి గనక బరిలోకి దిగితే.. లోకల్ పాలిటిక్స్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

yadavalli krishna

ఎడవల్లి కృష్ణ (Photo: Google)

కొత్తగూడెంలో కాంగ్రెస్ కొంత వీక్‌గా కనిపిస్తోంది. మొదట్నుంచి.. పార్టీని నాయకత్వలేమి ఇబ్బంది పెడుతోంది. సరైన లీడర్ ఉంటే.. పార్టీకి తిరుగుండదనే వాదన ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. బీఆర్ఎస్‌లో చేరడంతో.. క్యాడర్ అంతా చెల్లాచెదురైపోయింది. కాంగ్రెస్‌లో ఉండలేక.. బీఆర్ఎస్‌లో చేరలేక.. సతమతమవుతున్నారు. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు ఎక్కువే ఉన్నారు. ప్రస్తుతం.. హస్తం టికెట్ రేసులో ఎడవల్లి కృష్ణ, పోట్ల నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని.. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక.. ఎన్నికల నాటికి అధికార పార్టీ నుంచి ఎవరో ఒకరు కాంగ్రెస్‌లో చేరితే.. వాళ్లే పోటీ చేయడం ఖాయమనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఎడవల్లి కృష్ణ (Yadavalli Krishna)కు బలమైన సామాజికవర్గంతో పాటు గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి ప్రజల్లో ఎక్కువే ఉంది. అంతకముందు.. అనేక సేవా కార్యక్రమలతో.. జనంలోనే ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో.. బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేయడం కొంత మైనస్‌గా మారింది. గ్రూప్ పాలిటిక్స్ కూడా నష్టం చేసే అవకాశం ఉందంటున్నారు.

Potla Nageswar Rao

పోట్ల నాగేశ్వరరావు (Photo: Facebook)

ఇక.. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత పోట్ల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన.. ఈ మధ్యే కొత్తగూడెంకు మకాం మార్చారు. దాంతో.. పార్టీలోని ఓ వర్గం.. పోట్ల వైపు చేరింది. బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన పోట్ల నాగేశ్వరరావు.. తన సామాజికవర్గ ఓటర్లంతా.. తన వైపే ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉన్న పరిచయాలు కూడా కలిసొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ మధ్య కొత్తగూడెం రావడం, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడం, నియోజకవర్గంలో పర్యటించకపోవడం ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు.

Ponguleti Srinivas Reddy

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Photo: Twitter)

బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ కొత్తగూడెంలో బలంగా ఏమీలేదు. అయితే.. మారిన సమీకరణాలతో.. వలస వచ్చే నాయకులను బట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోనేరు సత్యనారాయణే.. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కోనేరు కుటుంబానికి మొదట్నుంచి కమ్మ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తోంది. గతంలో టీడీపీలో ఉన్నా.. ఇప్పుడు బీజేపీలోకి వచ్చినా.. వాళ్లు తమతోనే ఉన్నారని.. కోనేరు సత్యనారాయణ చెబుతున్నారు. అయితే.. పార్టీ బలంగా లేకపోవడం, ఆయన కూడా ప్రజల్లో పెద్దగా తిరగడపోవడం మైనస్ అయ్యే అవకాశం ఉంది. కోనేరు సత్యనారాయణ కాకుండా.. బీజేపీ తరఫున పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన.. బరిలోకి దిగితే.. అలవోకగా విజయం సాధిస్తారనేది.. మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెంలోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనేక సేవా కార్యక్రమాలతో పాటు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇక.. బీఆర్ఎస్‌లోని కొందరు నేతలు పొంగులేటి వెంటే ఉండటంతో.. ఆయన ఏ పార్టీలో చేరినా.. గెలుపుకు సహకరిస్తామని చెబుతున్నారు. పొంగులేటి.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. విజయం సాధిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Kunamneni Sambasiva Rao

కూనంనేని సాంబశివరావు (Photo: Facebook)

కొత్తగూడెం కార్మిక ప్రాంతం కావడం, సింగరేణి హెడ్ ఆఫీసు ఇక్కడే ఉండటంతో.. వేలాది మంది సింగరేణి కార్మికులు.. కొత్తగూడెం ప్రాంతంలోనే నివసిస్తున్నారు. పైగా.. సింగరేణి కార్మికులు అత్యధికంగా ఏఐటీయూసీలో ఉండటమే.. సీపీఐకి ఉన్న ఏకైక బలం. గతంలో.. మహాకూటమి తరఫున 2009లో సీపీఐ నుంచి పోటీ చేసి గెలిచారు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఆయన.. బీఆర్ఎస్, వామపక్షాల మద్దతుతో.. మరోసారి పోటీ చేస్తానని చెబుతున్నారు.

Also Read: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

ఇక.. కొత్తగూడెంలో సీపీఎంకు గెలిచే శక్తి లేకపోయినా.. ఓడించే శక్తి ఉందనే అభిప్రాయం ఉంది. ఆ పార్టీ.. ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తుందనేదే.. ఆసక్తిగా మారింది. సీపీఎంకు 10 వేల దాకా ఓట్ బ్యాంక్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆ ఓట్లు.. సీపీఎం ఏ పార్టీతో పొత్తులో ఉంటే.. ఆ పార్టీకి గంపగుత్తగా పడే అవకాశం ఉంది. ఇక.. రాష్ట్రంలో దాదాపు ఖాళీ అయిపోయిన టీడీపీ.. ఇటీవలే ఖమ్మం సభలో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఖమ్మం సభకు భారీగా జనం తరలిరావడంతో.. తెలుగుదేశం కూడా రేసులో ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇప్పుడే టీడీపీ బలాన్ని అంచనా వేయడం కష్టం. ఇక.. వైఎస్ షర్మిల కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో.. కొత్తగూడెంలోనూ ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. ఇలా.. కొత్తగూడెం సీటులో.. పొలిటికల్ హీటు బాగా పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో.. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారనేది.. ఆసక్తిగా మారింది.