Wyra: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. లోకల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Wyra: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి?

Wyra Assembly Constituency: 3 ఎన్నికలు.. 3 విలక్షణమైన తీర్పులు. అయితే.. దీనిని మించి విశేషం మరొకటుంది. వైరా సెగ్మెంట్‌లో 3 సార్లు గెలిచిన నాయకులంతా కారెక్కేశారు. ఇంకా అదే పార్టీలో జర్నీ చేస్తున్నారు. దాంతో.. వైరా రాజకీయం ఆసక్తికరంగా మారింది. మిగతా పార్టీల్లోనూ.. పదుల సంఖ్యలో ఆశావహులు కనిపిస్తున్నారు. ఎవరికి వారు క్యాంపులు ఏర్పాటు చేసుకొని మరీ లోకల్ పాలిటిక్స్‌ని హీటెక్కిస్తున్నారు. మరి.. ఈసారి వైరాలో గెలిచేది ఏ పార్టీ అభ్యర్థి? వచ్చే ఎన్నికల్లోనూ.. ఊహించని రిజల్ట్ వస్తుందా? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు? ఫైనల్‌గా.. వైరా సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. లోకల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పుడున్న నడుస్తున్న రాజకీయమే కాదు.. ఇంతకుముందు కూడా వైరా పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా సాగాయ్. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. వైరాలో ఎర్రజెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో.. వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో.. ఇక్కడి జనం విలక్షణమైన తీర్పు ఇచ్చారు. పార్టీలను కాదని.. ఓ స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు వైరా ఓటర్లు. అలా.. ఇప్పటిదాకా జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో.. మూడు రకాలు తీర్పులిచ్చారు. అయితే.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లంతా.. ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. దాంతో.. పార్టీలో గ్రూప్ తగాదాలు ముదురుతున్నాయ్. మిగతా పార్టీల్లోనూ టికెట్ కోసం జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయ్.

Ramulu Naik, Wyra MLA
రాములు నాయక్‌కు టికెట్ పోరు

వైరాలో.. లక్షా 84 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. ఎస్టీల ఓట్ బ్యాంక్ 40 వేలుగా ఉంది. ఎస్సీ ఓటర్లు 14 వేల మందికి పైనే ఉన్నారు. ఓసీలు 29 వేలకు పైగా ఉండగా.. బీసీ ఓట్ బ్యాంక్ లక్షా 10 వేలకు పైనే ఉంది. వీళ్లే.. వైరాలో గెలుపోటములను నిర్ణయించేది. అందుకే.. వైరా సీటును ఎలాగైనా గెలుచుకోవాలని.. బీఆర్ఎస్‌తో పాటు ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెంచేశాయ్. గత ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలిచిన రాములు నాయక్.. ఇప్పుడు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో సీపీఐ నుంచి గెలిచిన చంద్రావతి, 2014లో వైసీపీ నుంచి గెలిచిన మదన్‌లాల్ కూడా కారు పార్టీలోనే ఉన్నారు. వీళ్ల వల్ల.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు టికెట్ పోరు తీవ్రమవుతోంది. మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్.. ఈసారి బీఆర్ఎస్ టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సైతం ఇప్పటికే పార్టీ క్యాంప్ ఆఫీస్‌ని ప్రారంభించి.. తానే పోటీ చేస్తాననే సిగ్నల్ ఇస్తున్నారు. సిట్టింగులకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. తిరిగి తనకే అవకాశం దక్కుతుందని ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉన్నారు. ఈసారి రాములు నాయక్‌కు బదులు ఆయన తనయుడు జీవన్‌లాల్ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కుదిరేత.. మహబూబాబాద్ ఎంపీ గానీ, లేకపోతే.. వైరా ఎమ్మెల్యేగా గానీ పోటీ చేయడం ఖాయమంటున్నారు.

Ramulu Naik
అంతా కలిసి పనిచేస్తేనే..

స్వతహాగా కాంగ్రెస్ నేత అయిన రాములు నాయక్ గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌లాల్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగా.. అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులంతా.. బీఆర్ఎస్‌కు కాకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌కు మద్దతు తెలపడంతో.. ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే.. పొంగులేటి ఆధ్వర్యంలో.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పదవుల్లో.. పొంగులేటి అనుచరులకే ప్రాధాన్యత దక్కింది. పొంగులేటిని నమ్మి సొంత క్యాడర్ తయారుచేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు రాములు నాయక్. దాంతో.. ఇప్పుడు పొంగులేటి వర్గం నుంచి బరిలో దిగనున్న విజయాబాయి రూపంలో రాములు నాయక్‌కు ఇబ్బందులు మొదలయ్యాయ్. పైగా.. టికెట్ రేసులో ఉన్న మదన్ లాల్, చంద్రావతి, రాములు నాయక్‌లో.. ఎవరికి టికెట్ దక్కినా.. అంతా కలిసి పనిచేస్తే తప్ప.. గులాబీ జెండా ఎగిరే పరిస్థితులు లేవంటున్నారు.

Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

విజయబాయిని అభ్యర్థిగా ప్రకటించిన పొంగులేటి
కాంగ్రెస్ విషయానికొస్తే.. వైరాలో హస్తం పార్టీ బాగా బలహీనపడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీ-డీపీ, పొత్తులో భాగంగా.. సీపీఐ అభ్యర్థిగా బానోత్ విజయబాయిని పోటీకి దించారు. మూడు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కుదరక.. విజయబాయి పరాజయం పాలైంది. తర్వాత.. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనలేదు. నియోజకవర్గంలోనూ అంతగా పర్యటించలేదనే అసంతృప్తి క్యాడర్‌లో ఉంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్.. పొంగులేటి శిబిరంలో లేకపోవడంతో.. శ్రీనివాసరెడ్డి తన తరఫున పోటీ చేసే అభ్యర్థిగా విజయబాయిని ప్రకటించారు. ఆవిడ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. గెలుపు తనదేనంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2014లో మదన్ లాల్, 2018లో రాములు నాయక్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన పొంగులేటి.. ఈసారి విజయబాయిని గెలిపించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

Maloth ramdas naik
కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఎవరికో..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన విజయబాయి ఇప్పుడు పొంగులేటి గూటికి చేరడంతో.. కొత్త అభ్యర్థిని వెతికే పనిలో పడింది కాంగ్రెస్. దాంతో.. ఆశావహులు ఎక్కువగానే పోటీ పడుతున్నారు. ప్రధానంగా.. భట్టి విక్రమార్క అనుచరుడిగా మాలోత్ రాందాస్ నాయక్.. వైరాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు.. రేణుకా చౌదరి అనుచరుడిగా ఉన్న రామ్మూర్తి నాయక్.. టికెట్ తనకేనని క్యాంప్ ఆఫీస్ కూడా మొదలుపెట్టేశారు. మరోవైపు.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన.. బానోతు బాలజీ నాయక్ కూడా తనకే టికెట్ వస్తుందనే ప్రచారం మొదలుపెట్టారు. ఇలా.. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Also Read: మానకొండూరులో కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

Bhukya Shyam sundar naik
బీజేపీ టిక్కెట్ రేసులో ముగ్గురు

బీజేపీలోనూ వైరా సీటుకు పోటీ బాగానే ఉంది. ముగ్గురు అభ్యర్థులు.. టికెట్ రేసులో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన కాట్రావత్ మోహన్ నాయక్, బోనకల్ మండలానికి చెందిన బీపీ నాయక్, బీజేపీలో పనిచేస్తున్న.. భూక్య శ్యాంసుందర్ నాయక్.. టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో.. కమలం పార్టీకి బలమైన క్యాడర్ లేకపోయినా.. పోటీ చేసేందుకు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక.. గిరిజన సంఘం జిల్లా కార్యదర్శిగా, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న భూక్య వీరభద్రం.. సీపీఎం అభ్యర్థిగా పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పటికే గత ఎన్నికల్లోనే పోటీ చేసి ఓటమి చెందారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. జనంలో ఉంటున్నారు. అయితే.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వామపక్షాలు పెట్టుకునే పొత్తుపైనే.. ఇక్కడ సీపీఎం అభ్యర్థి పోటీ ఆధారపడి ఉంటుందా? లేక.. ఇతర పార్టీల అభ్యర్థికి మద్దతివ్వాల్సి ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఇంతటి రసవత్తర రాజకీయం నడుమ.. ఎప్పటిలాగే వచ్చే ఎన్నికల్లో.. వైరాలో ఊహించని రిజల్ట్ వస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది. ఓవరాల్‌గా వైరా సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీన్ ఎలా ఉండబోతుందన్నది.. మరింత ఆసక్తి రేపుతోంది.