కొత్త ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ కొత్తగా ఉందా? ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు, నేత‌లు రాకపోవడానికి రీజనేంటి?

న‌వీన్ యాద‌వ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. తన గెలుపు కోసం పనిచేసిన అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పారు. కానీ మూడు నెల‌లుగా ప‌నిచేసిన ముగ్గురు మంత్రులను.. ముందుగా వెళ్లి క‌నీస మ‌ర్యాద‌గా క‌ల‌వ‌లేద‌ట‌.

కొత్త ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ కొత్తగా ఉందా? ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు, నేత‌లు రాకపోవడానికి రీజనేంటి?

Updated On : November 27, 2025 / 8:31 PM IST

Naveen Yadav: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నిక. అధికార పార్టీ క్యాండిడేట్‌గా గెలిచిన ఎమ్మెల్యే. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంచార్జ్‌లుగా బాధ్యతలు తీసుకుని పనిచేసిన ప్రత్యేక పరిస్థితి. కానీ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి మాత్రం..ఇద్దరు మంత్రులు మినహా అమాత్యులెవరూ పాల్గొనలేదు.

చివరకు పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కూడా ఎమ్మెల్యే ప్రమాణ‌స్వీకారానికి దూరంగా ఉండిపోయారు. మంత్రులందరికీ ఆహ్వానం అందినా మినిస్టర్లు కార్యక్రమానికి రాకపోవడంపై చర్చ జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో ఉన్నా ప్రమాణస్వీకారోత్సవానికి డుమ్మా కొట్టడంపై హస్తం పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. (Naveen Yadav)

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతలను మొద‌ట్లో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులపై పెట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిని ఉప ఎన్నికకు దాదాపు మూడు నెలల ముందే ఇంచార్జీలుగా నియమించారు. ఈ ముగ్గురు మంత్రులు ఉప ఎన్నిక విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. తమ నియోజకవర్గ ఎన్నిక కంటే ఎక్కువగానే ముగ్గురు మంత్రులు పని చేశారు. అయితే ఈ ముగ్గురు మంత్రులు నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాక‌పోవ‌డంతో పార్టీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read: చంద్రబాబు, లోకేశ్‌ వార్నింగ్‌లు వర్కౌట్‌ అవుతున్నట్లేనా? వారికి నోటీసులెందుకు?

హైదరాబాద్‌లో ఉండి ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారంలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం వల్లే ప్రమాణ స్వీకారానికి రాలేదని మంత్రులు చెబుతున్నా..ఆ ముగ్గురు అమాత్యులు ఎక్కడో ఫీలయ్యారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మహేష్ గౌడ్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక ఇది. బీసీ వ‌ర్గానికి చెందిన నవీన్‌ యాదవ్‌ ఓథింగ్‌ సెర్మనీలో మహేష్ గౌడ్ పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ వ‌ర్గాల్లో చర్చకు దారి తీసింది.

గెలిచిన తర్వాత వారిని కలవలేదా?
న‌వీన్ యాద‌వ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. తన గెలుపు కోసం పనిచేసిన అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పారు. కానీ మూడు నెల‌లుగా ప‌నిచేసిన ముగ్గురు మంత్రులను.. ముందుగా వెళ్లి క‌నీస మ‌ర్యాద‌గా క‌ల‌వ‌లేద‌ట‌. మంత్రుల‌లో కూడా అంద‌రినీ క‌లిసిన త‌ర్వాత ఈ ముగ్గురి దగ్గరికి వెళ్లార‌ట‌. దీంతో స‌ద‌రు మంత్రులు హర్ట్ అయినట్లు టాక్.

అందుకే పొన్నం ప్రభాక‌ర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంక‌ట‌స్వామిలు హైద‌రాబాద్‌లో ఉండి కూడా న‌వీన్ ప్రమాణస్వీకారోత్సవానికి దూరంగా ఉండిపోయార‌ట‌. ఇక పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. న‌వీన్ గెలిచిన త‌ర్వాత పీసీసీ చీఫ్‌ను ఇంటికి వెళ్లి క‌ర్టసీగా క‌ల‌వ‌లేద‌ట‌. ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రామ్‌ ఆఫీస్‌కు వెళ్లి క‌లిశారు కానీ..పీసీసీ చీఫ్ దగ్గరకు స్వయంగా వెళ్లలేద‌ట‌.

ఇక ప్రమాణ‌స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించే విష‌యంలో కూడా నవీన్ యాదవ్ చిన్నచిన్న పొరపాట్లు చేసినట్లు సమాచారం. రీజన్స్ ఏవైనా పలువురు మంత్రులు, కీలక నేతలు అలకబూని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని..హస్తం పార్టీ లీడర్లను అర్ధం చేసుకోవడంలో నవీన్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారని..దాన్ని సరిచేసుకోకుంటే ఫ్యూచర్‌లో మరింత కష్టమవుతుందని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.