తెలంగాణ పాలిటిక్స్‌లో నెక్స్ట్ లెవల్‌ స్ట్రాటజీస్.. కాంగ్రెస్ వాడిన అస్త్రంతోనే బీఆర్ఎస్‌ అటాకింగ్ మోడ్

కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్..దానిపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్‌ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్‌..

తెలంగాణ పాలిటిక్స్‌లో నెక్స్ట్ లెవల్‌ స్ట్రాటజీస్.. కాంగ్రెస్ వాడిన అస్త్రంతోనే బీఆర్ఎస్‌ అటాకింగ్ మోడ్

Updated On : November 27, 2025 / 10:08 PM IST

BRS: ఇప్పటివరకు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది అధికార కాంగ్రెస్. ఇక ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల అస్త్రాన్ని కాంగ్రెస్‌పై వాడుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అంతా అవినీతి మయం. కబ్జాల రాజ్యం అంటూ దుమ్మెత్తిపోస్తోంది గులాబీ పార్టీ. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని..కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలపై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్..దానిపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్‌ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఇక బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద స్కామ్‌ జరిగిందని ఆరోపించి..కమిషన్ వేసింది. కానీ ఇంతవరకు నివేదికను బయటపెట్టలేదు. (BRS)

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ వ్యవహారంలోని మాజీ మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయనను రేపో మాపో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇవే కాకుండా గొర్రెల పంపిణీ పధకంతో పాటు మరికొన్ని అంశాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ విచారణ జరుగుతోంది.

Also Read: TTD: అటు పరకామణి కేసు.. ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్.. ఏం జరుగుతోంది?

అయితే ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్‌పై రివర్స్ అటాకింగ్ మొదలుపెట్టింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తోంది గులాబీ పార్టీ. రేవంత్ సర్కార్ తీసుకున్న, తీసుకుంటున్న నిర్ణయాలపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అంశాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఎక్కడెక్కడా ఏం తప్పు జరిగిందో ఆధారాలు బయపెడుతోంది. క్యాబినెట్‌లో అలా చర్చించారో లేదో..ఇలా బయటపెట్టేస్తోంది.

ఇదిగో జీవో..అదిగో స్కామ్..అంటూ..
ఇదిగో జీవో..అదిగో స్కామ్..అంటూ ప్రూఫ్స్‌తో సహా మీడియా ముందు వాలిపోతున్నారు గులాబీ లీడర్లు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో 10 వేల కోట్ల అవినీతి దాగుందని ఆరోపించడంతో పాటు కోర్టు వరకు వెళ్లి సదరు భూముల అమ్మకం ఆగేలా చేసింది బీఆర్ఎస్. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 9 వేల ఎకరాల పారిశ్రామిక భూములను అప్పనంగా తమ అనూయులను కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వెనుక లక్షల కోట్ల అవినీతి దాగుందని చెప్తూ వస్తోన్న బీఆర్ఎస్..ఈ ఇష్యూపై కూడా అవసరమైతే కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతోంది.

లేటెస్ట్‌గా విద్యుత్ శాఖలోను భారీ అవినీతికి ప్లాన్ చేశారని రేవంత్ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించింది గులాబీ పార్టీ. రామగుండం, దామచర్ల, మక్తల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక 50 వేల కోట్ల అవినీతి దాగుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓ వైపు ఆరుగ్యారెంటీలు సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూనే రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కారు పార్టీ.

వరుస అటాక్‌లతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్న అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమైంది గులాబీ పార్టీ. ఇలా మొన్నటి వరకు తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ఆటాక్ చేస్తూ వస్తుండగా..ఇప్పుడు రెండేళ్ల రేవంత్ సర్కార్ పై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది బీఆర్ఎస్. అదే అవినీతి ఆరోపణల అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్‌కు కంటి మీద కునుకులేకుండా చేసే స్కెచ్‌ వేస్తున్నారు కారు పార్టీ లీడర్లు.