Artificially Coloured Eggs: ఎంతకు తెగించార్రా..! కోడి గుడ్లకు రంగు వేసి నాటుకోడి గుడ్లు అంటూ అమ్మకాలు..
గోదాంలో రెడీ అవుతున్న మరో 45వేల ఎగ్స్ ను సైతం సీజ్ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.
Artificially Coloured Eggs: మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డబ్బు ఆశతో కొందరు నీచులు దారుణానికి ఒడిగట్టారు. కోడి గుడ్లకు రంగు వేసి నాటుకోడి గుడ్లు అంటూ అమ్మేస్తున్నారు. ఈ ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ నాటు కోడి గుడ్లను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. బ్రాయిలర్ ఎగ్స్(తెలుపు) కు రంగులు పూసి నాటు కోడి గుడ్లు అంటూ అమ్మేస్తున్నారు. దీని గురించి సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు.
నకిలీ నాటు కోడి గుడ్లను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ముఠా ఇప్పటికే 4.5 లక్షలకుపైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించారు. గోదాంలో రెడీ అవుతున్న మరో 45వేల ఎగ్స్ ను సైతం సీజ్ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. గుడ్ల ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ తాము తిన్నవి నకిలీ నాటు కోడి గుడ్లు ఏమోనని వర్రీ అవుతున్నారు. కాగా, ఇలాంటి నకిలీ ఎగ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
”మొరాదాబాద్‌లోని రాంపూర్ దోహ్రాహా బర్వాలా మజ్రా ప్రాంతంలోని గుడ్ల గోడౌన్‌పై దాడి చేశాం. తెల్లటి గుడ్లను కృత్రిమ రంగుతో పెయింట్ చేసి ఖరీదైన దేశీ గుడ్లుగా విక్రయిస్తున్నారు. సాధారణ తెల్ల గుడ్ల కంటే దేశీ గుడ్లు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతాయి. దీంతో ఈ ముఠా లాభాపేక్షతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. రంగులు వేసిన 4లక్షల 53వేల 600 గుడ్లుతో పాటుగా 35,640 రంగు లేని తెల్ల గుడ్లను స్వాధీనం చేసుకున్నాం. స్వాధీనం చేసుకున్న స్టాక్ మొత్తం విలువ 3లక్షల 89వేల 772 రూపాయలుగా అంచనా. గోడౌన్‌ను సీజ్ చేశాం. రంగులు వేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. కృత్రిమ రసాయనాల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఈ ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అధికారులు తెలిపారు.
Also Read: ఎక్స్‌పెరిమెంట్ అంట.. ప్రతిరోజు 10,000 కేలరీల జంక్ ఫుడ్‌ను తినేసిన ఇన్‌ఫ్లుయెన్సర్.. చివరకు..
