Manakondur: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.

Manakondur: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

Manakondur Assembly Constituency: కరీంనగర్‌కు కూతవేటు దూరంలో ఉండే ప్రాంతమది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. అధికార పార్టీకి కంచుకోటగా మారిన నియోజకవర్గమది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత సైతం.. గులాబీ కండువా కప్పుకోవడంతో.. అక్కడ కారు పార్టీకి ఎదురనేదే లేకుండా పోయింది. దాంతో.. మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్. ఈ పరిస్థితుల్లో.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా? మానకొండూరు సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

గెలుపోటములను నిర్ణయించేది దళితుల ఓట్లే
2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో భాగంగా ఏర్పడిన నియోజకవర్గం.. ఈ మానకొండూరు. ఇది.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్. ఇక్కడ.. 2 లక్షల 11 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో.. పురుషులు లక్షా 4 వేల మందికి పైగా ఉండగా.. మహిళలు లక్షా 7 వేల మందికి పైనే ఉన్నారు. మానకొండూరు ఓటర్లలో.. దళితుల ఓట్ బ్యాంక్ 35 వేలుగా ఉంది. గీత కార్మికులు 21 వేలు, మున్నూరు కాపులవి 18 వేల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక.. ఈ సెగ్మెంట్‌లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది మాత్రం దళితుల ఓట్లే. గీత కార్మికులు, ముదిరాజ్ ఓటర్ల ప్రభావం కూడా కొంత కనిపిస్తుంటుంది. ఎన్నికలకు.. ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. కుల సంఘాల నేతలను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెడుతున్నాయ్. పైగా.. గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓట్లు అధికంగా ఉన్న సామాజికవర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా.. స్కెచ్‌లు గీస్తున్నాయ్ రాజకీయ పార్టీలు.

Rasamayi Balakishan
రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ కొడతారా?

ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో.. మానకొండూరులో తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. అప్పుడు హస్తం పార్టీ తరఫున ఆరెపల్లి మోహన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో.. మానకొండూరులో కారు జోరే కనిపించింది. బీఆర్ఎస్ తరఫున రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈసారి కూడా గెలిచి మానకొండూరులో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు రసమయి. మరోవైపు.. ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ నాయకత్వం మాత్రం రెండు పార్టీలను ఎదుర్కొనే బలమైన అభ్యర్థిని వెతికే వేటలో పడింది. బీఎస్పీ కూడా పోటీకి సై అంటోంది.

Arepalli Mohan
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఆరెపల్లి మోహన్ (Arepalli Mohan).. గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆయన మానకొండూరు టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక.. మరో బీఆర్ఎస్ సీనియర్ నేత ఓరుగంటి ఆనంద్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. అయితే.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టబోయేది తానేననే ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వం సంక్షేమ పథకాలు.. రసమయికి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. కానీ.. దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పెండింగ్‌లో ఉండటం.. కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. కరువుతో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాలకు సాగు నీటి సమస్య తీరింది. మొత్తంగా.. ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చానని రసమయి బాలకిషన్ చెప్పుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను కూడా సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేస్తానంటున్నారు. ఇక.. బీఆర్ఎస్ నుంచి ఆశావహుల పోటీ ఎక్కువే ఉన్నా.. టికెట్ మాత్రం తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు రసమయి బాలకిషన్.

Also Read: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Kavvampally Satyanarayana
పోటీకి సై అంటున్న కవ్వంపల్లి

కాంగ్రెస్ విషయానికొస్తే.. కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే.. మానకొండూరు నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. హస్తం పార్టీలో టికెట్ పంచాయతీ లేనప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఇప్పటికే చాలా వరకు.. తన క్యాడర్‌ని.. బీఆర్ఎస్‌కు మార్చేశారు. దాంతో.. బలమైన క్యాడర్ లేకపోవడంతో కవ్వంపల్లి సతమతమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోతే.. ఆరెపల్లి మోహన్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అప్పుడు.. కవ్వంపల్లి పరిస్థితేమిటన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ.. అదే గనక జరిగితే.. మానకొండూరు కాంగ్రెస్‌లో.. మళ్లీ జోరు పెరుగుతుందని చెబుతున్నారు. ఇక.. మానకొండూరులో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేత సత్యనారాయణ.

Also Read: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

Gaddam Nagaraju, BJP
బలమైన అభ్యర్థి వేటలో బీజేపీ

రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా కనిపిస్తున్న బీజేపీకి.. మానకొండూరులో మాత్రం అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో.. బీజేపీ తరఫున గడ్డం నాగరాజు (Gaddam Nagaraju) పోటీ చేశారు. కానీ.. ఈసారి ఎవరిని బరిలోకి దించుతారన్నది మాత్రం స్పష్టత లేదు. నాగరాజుతో పాటు దరువు ఎల్లన్న (Daruvu Yellanna), అజయ్ వర్మ లాంటి వారు టికెట్ రేసులో ఉన్నారు. కానీ.. వీళ్లంతా.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేంత దీటైన అభ్యర్థులు కారనే చర్చ సాగుతోంది. దాంతో.. కమలదళం.. బలమైన అభ్యర్థిని వెతికే పనిలో పడింది. పైగా.. మానకొండూరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది. దాంతో.. ఆయన కూడా ఫోకస్ పెంచారు. బలమైన అభ్యర్థిని పోటీకి దించి.. మానకొండూరులో కాషాయం జెండా ఎగరేయాలని చూస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని.. ఇక్కడి నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా కాషాయ పార్టీలో సాగుతోంది. ఆయన మాత్రం.. ధర్మపురి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: కంచుకోటలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా.. శంకర్ కు ఒక్క చాన్స్ ఇస్తారా?

Kavvampally, Arepalli, Rasamayi
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఫైట్

గత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రసమయి బాలకిషన్‌కు దాదాపు 89 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆరెపల్లి మోహన్‌కు 57 వేల పైనే ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థికి మాత్రం 5 వేల లోపే ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన.. మానకొండూరులో బీజేపీ ఎంతో బలపడాల్సి ఉంది. డిపాజిట్ కూడా దక్కని స్థాయి నుంచి ఏకంగా నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరేయాలంటే.. అక్కడ బరిలోకి దిగే అభ్యర్థి మీదే ఆధారపడి ఉంటుంది. అందువల్ల.. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు చూపుతున్న బీజేపీ.. ఈసారి మానకొండూరులో ఎవరిని బరిలోకి దించబోతుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. ప్రధాన పార్టీలతో పాటు బహుజన సమాజ్ పార్టీ, వైఎస్సార్‌టీపీ అభ్యర్థులు కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది. వాళ్లు పోటీలో ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం.. మానకొండూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఎలక్షన్ ఫైట్ ఉండబోతుందనేది అర్థమవుతోంది. మరి.. అక్కడి ప్రజలు ముచ్చటగా మూడోసారి రసమయి బాలకిషన్‌ని గెలిపిస్తారా? లేక.. ఇతర పార్టీల అభ్యర్థులకు చాన్స్ ఇస్తారా? అన్నది.. ఆసక్తిగా మారింది.