కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మాకు ఢోకా లేదు: కిష‌న్‌రెడ్డి

ఈటల రాజేందర్ రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు.

Kishan Reddy: తెలంగాణలో ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిష‌న్‌రెడ్డి అన్నారు. గురువారం ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో 12కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు తమకు ఢోకా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచేలా ప్రయత్నం చేయాలని బీజేపీ నాయకులు, శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

”ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఈటల రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోదీలో ఉంది. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవాలి. 12కు పైగా స్థానాలను గెలుస్తున్నాం.

బీజేపీకు BRS బీ టీం అంటున్నారు.. మేము ఎవరికి బీ టీం కాదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. BRS అనేది లేదు. వాళ్లకి ఒక్క సీట్ రాకపోయినా నష్టమేమి లేదు. BRS వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. దీన్ని ఎవరు ఆపలేరు.ఐక్యమత్యంగా పని చేసి మల్కాజ్ గిరిలో ఈటలను గెలిపిద్దాం. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్టానం చెప్పింది. నామినేషన్ తరువాత అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేయాలి. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించాలి.

Also Read: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్‌.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మనకు ఢోకా లేదు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడం లేదు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో వంశీ తిలక్‌ను గెలిపించాలి. అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించాడు వంశీ. కంటోన్మెంట్ ఎన్నికలు కూడా మనకు కీలకం.. అసెంబ్లీ సీటును కూడా గెలవాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా బీజేపీ గెలుపును ఆపలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడానికి.. లోక్‌స‌భ‌ ఎన్నికలు మొదటి అడుగు” అని కిషన్ రెడ్డి అన్నారు.

కాగా, మ‌ల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా వంశీ తిలక్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు