లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్‌.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్‌.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Bethi Subhas Reddy

BRS Party : లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, మాజీ కార్పొరేటర్ భేతి స్వప్న, అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం భేతి శుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,  ఈటల రాజేందర్ సమక్షంలో శుభాష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి హాజరయ్యారు. వారందరి సమక్షంలో శుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు.

Also Read : ఏపీ, తెలంగాణలో ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ

కేసీఆర్ కు రాసిన రాజీనామా లేఖలో భేతి శుభాష్ రెడ్డి కీలక విషయాలు ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. నామీద ఎలాంటి మచ్చలేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. కనీసం వారికి టికెట్ ఇచ్చేముందు నాకు మాటమాత్రమైనా చెప్పలేదు. అయినా మీ మాటను శిరసా వహిస్తూ వారి గెలుపుకోసం కృషి చేశాను. మొన్న మళ్లీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ ను రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చలేకుండా ఇచ్చారు. కానీ, బీజేపీలో తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన అవకాశవాద ఎంపీ అభ్యర్థి కంటే బీజేపీ టికెట్ ఇచ్చిన మా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ ను గెలిపించాలనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని శుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Bodhan Former MLA Shakeel : నా కొడుకును టార్గెట్ చేశారు – మాజీ ఎమ్మెల్యే షకీల్

అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆ పార్టీకి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి దంపతులతోపాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత భేతి శుభాష్ రెడ్డి, ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగాఉన్న శుభాష్ రెడ్డిని కాదని బండారు లక్ష్మారెడ్డికి కేసీఆర్ టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి పార్టీ అధిష్టానం పట్ల శుభాష్ రెడ్డి, ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వారు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.