KTR: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్ లో వాకబు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు కేటీఆర్. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో పాటు ఏఐజి ఆసుపత్రి వైద్య బృందంతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.
గోపీనాథ్ కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆసుపత్రి సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు కేటీఆర్. ఐసీయూలో అందిస్తున్న వైద్యంపై పూర్తి సమాచారం తీసుకున్నారు. గోపీనాథ్ కు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని కేటీఆర్ కు వివరించింది ఏఐజి వైద్య బృందం. మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేటీఆర్.
కాగా, గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అమెరికా పర్యటనను కుదించుకుని ఈరోజు రాత్రి హైదరాబాద్ కి బయలుదేరనున్నారు.
Also Read: హైదరాబాద్‌లో రాఫెల్ యుద్ధ విమానాల అత్యంత కీలక విడిభాగాల తయారీ.. టాటా గ్రూప్, డసాల్ట్ మధ్య బిగ్ డీల్
ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ తెలిపారు. 48 గంటలు గడిస్తేనే పరిస్థితి తెలుస్తుందని డాక్టర్లు చెప్పారని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆసుపత్రిలో ఉండి డాక్టర్లతో నిరంతరం మాట్లాడుతున్నారని, పార్టీ వర్గాలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. గోపీనాథ్ కోలుకోవాలని ప్రజలు, పార్టీ శ్రేణులు పూజలు చేయాలన్నారు.
మాగంటి గోపీనాథ్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. గుండె సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ సమస్యతో గోపీనాథ్ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏఐజి వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ 48 గంటలు చాలా క్రిటికల్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని గచ్చిబౌలి AIG ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. నెల రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నెల రోజుల పాటు AIG ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హార్ట్ ఎటాక్ వచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.