ఆ జీవో వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం- రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.

Harish Rao : Harish Rao : మెడికల్ అడ్మిషన్ల కోసం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 33పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ జీవోతో తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఏ అంశంపైన కూడా కనీస అవగాహన లేని ప్రభుత్వం.. అడ్డదిడ్డంగా పాలన సాగిస్తోందన్నారు. చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితే లోకల్ గానే పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. పొరపాటున మన పిల్లలు బయటకు వెళ్లి రెండేళ్లు చదివితే వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రభుత్వానికి చేతకాకపోతే గతంలో బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన జీవోను ఫాలో అయితే సరిపోయేది కదా అంటూ చురకలు అంటించారు హరీశ్ రావు.

కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో పాలన అడ్డదిడ్డంగా మారిందని ధ్వజమెత్తారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సరిగా లేవని విమర్శించారు. రేవంత్ సర్కార్ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలతో తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చామని గుర్తు చేసిన హరీశ్ రావు.. విద్య విషయంలో కూడా అలా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల పాటు విద్యా విధానం యధావిధిగా కొనసాగాలని పునర్విభజన చట్టంలో ఉందన్నారు. అందుకే మేము చేయలేకపోయాము అని తెలిపారు.

తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కొత్త కళాశాలలో స్థానికేతరులకు అవకాశం ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వ నిర్ణయంతో బి కేటగిరి సీట్లు కూడా తెలంగాణ విద్యార్థులకే దక్కాయన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థానికతను నిర్ధారించుకునేందుకు ఈ విడత అవకాశం వచ్చిందన్నారు హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి కసరత్తు చేయకుండా పాత విధానాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం తేల్చలేదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు యధావిధిగా పెట్టాలి లేదంటే ఇతర రాష్ట్రాల మాదిరిగా నిబంధనలు సవరించాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు.

”ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్స్ ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణ బిడ్డలు తెలంగాణకు నాన్ లోకల్ గా మారే విధంగా ఉంది. కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు.. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి” అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

”మెడికల్ అడ్మిషన్ల విషయంలో రేవంత్ సర్కార్ నిబంధనలు సరిగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంపైన కూడా క్లారిటీ లేదు. కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం జీవో తెచ్చింది. దీని వల్ల మన పిల్లలే మన రాష్ట్రంలో స్థానికేతరులుగా మారే అవకాశం ఉంది. ఇక్కడి మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు హరీశ్ రావు.

”ప్రభుత్వం ఒక కమిటీ వేసి నిబంధనలు రూపొందించాలి. ప్రభుత్వానికి అవగాహన లేకపోతే అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. మేము సూచనలు చేస్తాం. ప్రభుత్వ తీరు న్యాయపరమైన చిక్కులు తెచిపెట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. స్వచ్చదనం, పచ్చదనంకు ఒక్క రూపాయి కేటాయించలేదు. పంచాయతీ వర్కర్లకు రెండు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీల్లో నిధులు లేవు. ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతుంది. 8 నెలల కాంగ్రెస్ హయాంలో 8 పైసల నిధులు ఇవ్వలేదు. ఆసుపత్రుల్లో మందులు లేవు. మీ పాలన అంతా గందరగోళం, అయోమయం” అని విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

Also Read : సభలో అడుగు పెట్టేది అప్పుడే..! అసెంబ్లీకి హాజరుపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లారిటీ..!

ట్రెండింగ్ వార్తలు