KTR Fires On Telangana Congress Party
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హామీలు తప్ప అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతుబంధు, రుణమాఫీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టింది. ఎన్నికలు వస్తేనే గ్యారెంటీల ప్రస్తావన తీసుకొస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు వేయరని ముందే చెప్పాం..
‘నల్గొండ ఐటీ టవర్ బోసిపోయింది. స్కూళ్లలో పిల్లలకు సరైన భోజనం లేదు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పకాదు. రైతుబంధు డబ్బులు పడతాయని అన్నారు. పడ్డాయా? కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు వేయరని ముందే చెప్పాం. కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇచ్చినా ప్రచారం చేసుకోలేదు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి’ అని రేవంత్ సర్కార్ ని డిమాండ్ చేశారు కేటీఆర్.
Also Read : మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మీ డబ్బులు వాపస్ ఇస్తున్న ప్రభుత్వం
భారత దేశంలో తెలంగాణను నెంబర్ 1 చేసింది కేసీఆరే..
కేసీఆర్ నల్గొండకు ఏం చేశారని ఓ మంత్రి అసెంబ్లీ అడిగారు. భారత దేశంలోనే పంజాబ్, హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో తెలంగాణను నెంబర్ 1 చేశారు కేసీఆర్. తెలంగాణ భారత దేశానికి నెంబర్ 1 అయితే.. మొత్తం తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో నల్గొండను నెంబర్ వన్ చేశారు కేసీఆర్. జనవరి 26వ తేదీ రాత్రికే 12గంటలకే టకీ టకీ మని డబ్బులు పడతాయని సీఎం రేవంత్ చెప్పారు. పడ్డాయా? పడలేదా?
మీరు అడగాల్సిన అవసరం లేకుండానే కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇచ్చారు..
కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇచ్చారు. మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఆరేళ్లు నిరాటంకంగా ఇచ్చారు కేసీఆర్. నాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఓవైపు రుణమాఫీ చేయగానే.. ఈ పైసలు కచ్చితంగా మళ్లీ రైతులకు వేయాలని చెప్పి 2017లో దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం పెట్టారు.
ఆ ఒక్క పథకంతోనే 11 విడతల్లో కేసీఆర్ ప్రభుత్వం మీ ఖాతాల్లో 73వేల కోట్ల రూపాయలు వేసింది. 73వేల కోట్ల రూపాయలు వేసినా.. కేసీఆర్ ఎన్నడూ ఇలాంటి విన్యాసాలు చేయలేదు. టకీ టకీమని వస్తాయని డైలాగులు కొట్టలేదు.
నాట్లు అప్పుడు కాదు ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు పడుతుంది..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒకసారి మాత్రమే రైతుబంధు పడుతుంది. అది నాట్లు అప్పుడు కాదు ఓట్లప్పుడు మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి డబ్బులు వేసినట్లు వేశారు. అది కూడా మనం దాచిన పైసలే 7వేల 600 కోట్లు ఆయన వేశారు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ ఓట్ల కోసం గొప్ప డ్రామా ఆడుతున్నారు. జనవరి 24న మొదలవుతుందట. మార్చి 31వరు సాగుతుందట. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మార్చి 31 అన్నారు కానీ ఏ సంవత్సరం అనేది చెప్పలేదు.
Also Read : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?
రేవంత్ వచ్చాక దరఖాస్తులు, దండాలు తప్ప మరొకటి లేదు..
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు. రైతుభరోసా కావాలంటే దరఖాస్తు. కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే.. ఒకే ఒక్కరు ఉన్నారు. జిరాక్స్ సెంటర్ల వాళ్లు తప్ప మరెవరూ సంతోషంగా లేరు. పెట్టిన దరఖాస్తులే పెట్టి పెట్టి ప్రజలకు విసుగు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు టంగున టంటున పైసలు పడుతుండే.. ఈ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తులు, దండాలు పెట్టుడు తప్ప.. ఏమీ లేదు అనేకాడికి వచ్చింది.
ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. మరి పడ్డాయా? ఇప్పుడేమో మాట మార్చారు. సన్న వడ్లు పండిస్తేనే బోనస్ ఇస్తానని అంటున్నారు” అంటూ రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్.