మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మీ డబ్బులు వాపస్ ఇస్తున్న ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మీ డబ్బులు వాపస్ ఇస్తున్న ప్రభుత్వం

Abhaya Hastam funds

Updated On : January 28, 2025 / 9:19 AM IST

Telangana: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. త్వరలో వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 21లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీతో సహా నగదు జమకానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Gossip Garage : పదేళ్లు నేనే సీఎం..! ముఖ్యమంత్రి సీటుపై రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా? స్ట్రాటజీనా?

అభయహస్తం పథకం ఏమిటి..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది. 18 నుంచి 60ఏళ్ల పొదుపు మహిళలను ఇందులో సభ్యులుగా చేరడానికి అవకాశం కల్పించారు. ఈ పథకంలో చేరిన సభ్యులు తమవంతు వాటాగా ఏడాదికి 365 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో డబ్బులు జమచేసింది. సభ్యులకు 60ఏళ్ల వయస్సు దాటితే వారికి రూ.500 పింఛన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనికితోడు సంఘంలోని మహిళల కుటుంబంలో 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న వారి పిల్లలకు ఏడాదికి రూ. 12వేలు చెల్లించింది. సభ్యురాలు సహజ మరణం అయితే రూ.75వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 చెల్లించేవారు. 2016 వరకు ఈ పథకం సజావుగానే సాగినప్పటికీ.. ఆ తరువాత అధికారంలో ఉన్న ప్రభుత్వం దానిని నిలిపివేసి ఆసరా పింఛన్ ప్రారంభించింది. పింఛన్ సొమ్మును రెట్టింపు చేసింది. అయితే, మహిళలు కట్టిన సొమ్మును చెల్లిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది.

Also Read: Gossip Garage : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?

ప్రభుత్వం ఎంత చెల్లించనుంది..
2009 నుంచి 2016 వరకు 21 లక్షల మంది మహిళలు జమ చేసిన సొమ్ము ప్రభుత్వం వద్దే ఉంది. దీంతో 2022 మార్చి నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.545 కోట్లు అయింది. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.152 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మరో రూ.393 కోట్లు ప్రభుత్వం వద్దే ఉంది. తాజాగా వడ్డీతో కలిపి ఆ సొమ్ము రూ. 452 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆ సొమ్ము మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తరువాత లబ్ధిదారుల అకౌంట్లలో అభయహస్తం ప్రీమియం సొమ్మును ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలుస్తుంది.