Gossip Garage : పదేళ్లు నేనే సీఎం..! ముఖ్యమంత్రి సీటుపై రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా? స్ట్రాటజీనా?

పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.

Gossip Garage : పదేళ్లు నేనే సీఎం..! ముఖ్యమంత్రి సీటుపై రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా? స్ట్రాటజీనా?

Updated On : January 28, 2025 / 12:00 AM IST

Gossip Garage : నేనే రాజు. నేనే మంత్రి. ఇదో సినిమా టైటిల్‌ అయినప్పటికీ..సీఎం రేవంత్‌ కూడా ఇదే లైన్‌ను ఫాలో అవుతున్నారు. పదేళ్ల వరకు తానే ముఖ్యమంత్రినని..టెన్ ఇయర్స్ వరకు కాంగ్రెస్ పార్టీనే పవన్‌లో ఉంటుందని చెప్పుకొస్తున్నారు. సీఎం రేవంత్ చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ కాన్ఫిడెన్స్ వెనుక తనపై తనకున్న నమ్మకమా? కాంగ్రెస్‌ పార్టీలో ఎదురే లేదనే ధైర్యమా? రేవంత్ కామెంట్స్‌పై చిర్రుబుర్రు ఆడుతున్న మంత్రులెవరు?

వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా..
పదేళ్లు నేనే సీఎం. 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిని నేనే. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. ఇవీ.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు. వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఓ ఉదాహరణ సైతం ప్రస్తావించారు.

1994 నుంచి 2004 వరకు ఓ రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు మరో పార్టీకి అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2024 వరకు ఇంకో రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2024 నుంచి వచ్చే పదేళ్లు అంటే 2034 వరకు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని, తాను సీఎంగా ఉండి ప్రణాళికాబద్దంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్న మాట.

Also Read : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?

కాంగ్రెస్ కొత్త చర్చకు దారితీసిన సీఎం రేవంత్ వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పదేళ్ల పాటు అధికారం అన్న లాజిక్ బాగానే ఉన్నా.. సీఎంగా తాను పదేళ్ల పాటు కొనసాగుతానని చెప్పడమే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు సీఎంలు మారారు. టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో కేసీఆరే సీఎంగా కొనసాగారు. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీనే పవర్‌లో ఉన్నా.. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పడమే ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 

రేవంత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డికి తనపై తనకున్న నమ్మకంతో ఇంతలా ధీమా వ్యక్తం చేస్తున్నారా.? లేదంటే కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్న నమ్మకమా..లేక కాంగ్రెస్‌లో తనకు తిరుగులేదనే ధైర్యంతో మాట్లాడుతున్నారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.

జనం మూడ్‌ను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం..!
పార్టీ పవర్‌లో ఉంటుందని చెప్పడం వరకు ఓకే..కానీ తానే సీఎంగా ఉంటానని చెప్పడం వెనుక ఏదో స్ట్రాటజీ ఉందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, తన వెంట నడుస్తున్న నేతలకు భరోసా కల్పించేందుకే రేవంత్ ఇలా కామెంట్‌ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ పవర్‌లో ఉంటుంది..తాను సీఎంగా ఉంటానని చెప్పడం జనం మూడ్‌ను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం కూడా ఉందంటున్నారు.

రేవంత్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్లు..!
పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పూర్తి స్తాయి అండతోనే రేవంత్ రెడ్డి ఇంత ధీమాగా మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇటు తెలంగాణ ప్రజలను, అటు కాంగ్రెస్ హైకమాండ్‌ను సంతృప్తి పరిచేలా పరిపాలన చేస్తున్నానని, మళ్లీ తానే సీఎం అవుతానన్న విశ్వాసంతో ఉన్నారట రేవంత్.

అయితే ఇలా పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడాన్ని భవిష్యత్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ మంత్రులు, ప్రతిపక్షాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : వైసీపీ ప్లాన్ బెడిసికొట్టిందా? ఆ విధంగా కూటమి కార్యకర్తల్లో విభేదాలకు పవన్, లోకేశ్ చెక్..!

టెన్‌ ఇయర్స్ సీఎంగా ఉంటానని రేవంత్‌ చెప్పడం వెనుక పెద్ద ప్లాన్?
టెన్‌ ఇయర్స్ సీఎంగా ఉంటానని రేవంత్‌ చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ కాంగ్రెస్‌ పవర్‌లోకి వస్తే..లేకపోతే ఈ టర్మ్‌లో ఏదైనా ఇబ్బందులు వస్తే తమకు సీఎం పదవి వస్తుందని కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు ఆశ పడుతున్నారట. సేమ్‌టైమ్‌ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది..మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని కారు పార్టీ ధీమాలో ఉంది.

అటు పార్టీలో సీనియర్లను..ఇటు అపోజిషన్‌ను డైలమాలో పడేసేందుకు రేవంత్‌ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారట. పారిశ్రామిక వర్గాలు, అధికారులకు, ప్రజలకు అందరికీ ఓ సంకేతం పంపాలనే మాస్టర్‌ ప్లాన్‌తోనే రేవంత్ తానే సీఎం అంటున్నారని చర్చ జరుగుతోంది. మరీ రేవంత్‌ది ధీమానా లేక స్ట్రాటజీనా..ఆయన ఆశించినట్లు పదేళ్లు సీఎంగా ఉండగలుగుతారా లేదా.. చూడాలి మరి.