Malla Reddy : వాళ్లందరిని నేనే కాంగ్రెస్‌లోకి పంపా, కోవర్టులుగా పని చేస్తున్నారు- మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు... కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.

Malla Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అన్నారు. వారంతా తనకు కోవర్టులుగా పని చేస్తున్నారని తెలిపారు. వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని వెల్లడించారు మల్లారెడ్డి.

”బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. కాంగ్రెస్ అధికారంలోకి ఉందని వెళ్లారు. బీఆర్ఎస్ ను వీడి పోయినందుకు వాళ్లకు బాధగా ఉంది. రోజూ వారికి ఫోన్లు చేస్తున్నాం. మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తాం. మీరు అక్కడే ఉండండి. ఆ తర్వాత చూసుకుందాం. అక్కడే ఉంటూ ఇక్కడ ఓటు వేయండి అని వారితో చెప్పాను” అని మల్లారెడ్డి పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి చాలామంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో అనేక మున్సిపాలిటీలకు చెందిన ముఖ్యమైన నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమైన నేతలతో భేటీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలపై మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న వారంతా తన మనుషులేనని, తానే కావాలని వారందరిని పంపిస్తున్నానని, కోవర్టు ఆపరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, కాంగ్రెస్ లో చేరినా బీఆర్ఎస్ కోసమే పని చేస్తారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం పని చేయడానికే కాంగ్రెస్ లోకి వెళ్లారు అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు మేడ్చల్, జీహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్లు, మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు, నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

Also Read : నో బెయిల్.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు

ట్రెండింగ్ వార్తలు