Fake Court
Gujarat Fake Court: నకిలీ ఐపీఎస్, నకిలీ ఇన్ స్పెక్టర్..ఇలా పలురకాల వార్తలను మీరు వినే ఉంటారు.. కానీ, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి న్యాయమూర్తిగా నటిస్తూ నకిలీ కోర్టును నడుపుతున్నాడు.. ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా ఇలానే నకిలీ కోర్టును నడుపుతున్నాడు. ఆ సమయంలో కోట్లాది విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులలో ఆదేశాలు జారీ చేశాడు. కేసుల పరిష్కారానికి ఖాతాదారుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూళ్లు చేసేవాడు. ఇటీవల ఇతగాడి గుట్టురట్టు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కోర్టునే నడిపిన వ్యక్తిపేరు మోరిస్ శామ్యూల్.
Also Read: KTR Legal Notice: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నోటీసుతోనే జవాబిస్తానన్న సంజయ్
ఐదేళ్లుగా మోసం..
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కోర్టు తరహాలోనే ఐదేళ్లుగా మోరిస్ శామ్యూల్ కోర్టును నడుపుతూ ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. నకిలీ కోర్టులో మోరిస్ ప్రజల కేసులకు సంబంధించిన వాదనలు విని.. ఆపై ట్రిబ్యునల్ అధికారిగా ఉత్తర్వులు జారీ చేసేవాడు. ఈ సమయంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అతనితో అక్కడ నిలబడి ఉండేవారు. తద్వారా ప్రజలుసైతం ఇది నిజమైన కోర్టేనని నమ్మారు. ఈ విధంగా మోరిస్ సుమారు 11 కేసుల్లో అతనికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశాడు.
నకిలీ కోర్టు ఎలా బట్టబయలైంది?
అహ్మదాబాద్ లోని భదర్ లోని సిటీ సివిల్, సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ హార్ధిక్ దేశాయ్ కారణంగా నకిలీ కోర్టు, నకిలీ న్యాయమూర్తి మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ మోసం బట్టబయలు అయింది. కరంజ్ పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
2019లో ప్రభుత్వ భూమికి సంబంధించి తన క్లయింట్ కు అనుకూలంగా శ్యామూల్ ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ తరువాత ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్ పేరును చేర్చాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ శామ్యూల్ మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేశాడు. తాను జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను కూడా ఈ పిటిషన్ కు జత చేశాడు. ఆ ఉత్తర్వులు నకిలీవని కోర్టు రిజిస్ట్రారు గుర్తించడంతో శామ్యూల్ బండారం బయటపడింది. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ ను పోలీసులు అరెస్టు చేశారు.