Telangana Politics : టిక్కెట్ ఎలా ఇవ్వరో చూస్తాం.. మూడు ప్రధాన పార్టీల్లోనూ టిక్కెట్ల లొల్లి..

హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.

Fight on between aspirants, sitting MLAs for party tickets in Telangana politics

Telangana Politics- Tickets Fight : ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు పార్టీలో చేరికలు.. బుజ్జగింపులు.. ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టిన ప్రధాన పార్టీలు.. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. నేడో రేపో తొలి జాబితా ప్రకటనకు ప్రధాన పార్టీలు మూడూ సిద్ధమవుతున్నాయి. ఈ విషయం పసిగట్టిన నేతలు.. టిక్కెట్ కోసం పైరవీలు చేయడంలో బిజీ అయిపోయారు. ఇప్పుడు తప్పితే మళ్లీ ఐదేళ్లవరకు ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేదన్న భావనతో అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. తమ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ టిక్కెట్ ఎలా ఇవ్వరో చూస్తామంటూ సవాళ్లు విసురుతూ శపథాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్‌లో (BRS Party) ఈ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు టిక్కెట్లకు దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్‌ (Telangana Congress) పిలుపునివ్వడం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.. బీజేపీలో (BJP Telangana) ఈ తరహా ఒత్తిళ్లు బయట పడకపోయినా.. అంతర్లీనంగా టిక్కెట్ ఫైట్ ఎక్కువగానే ఉందంటున్నారు.

మూడు గ్రూపులు.. ఆరు సమావేశాలుగా మారింది తెలంగాణ రాజకీయం.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టడంతో ఆశావహులు తమ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ.. ప్రత్యేక చర్చకు దారితీస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల లొల్లి చాలా ఎక్కువగా ఉంది. వరుసగా రెండుసార్లు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ మూడోసారి గెలుపుపై గట్టి నమ్మకంతో ఉంది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఈ సారి కొంతమందికి కత్తెర వేస్తానని గతంలో ప్రకటించడంతో ఆ పార్టీ జాబితాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 30 మందికి టిక్కెట్లు దక్కవని గతంలో అనేక లీకులు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య 12 నుంచి 15 మధ్యే కనిపిస్తోంది. సీఎం హెచ్చరికలతో చాలా మంది సర్దుకోవడంతో మళ్లీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఐతే బీఆర్‌ఎస్ జాబితా విడుదలపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు భావించాయి. కానీ, అసంతృప్తుల బెడదతో కాస్త ఆలస్యమైంది. ఇక మరో 50 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో త్వరలో జాబితా విడుదల చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించినట్లు చెబుతున్నారు. మంచి ముహూర్తం చూసుకుని ప్రకటిస్తారని బీఆర్‌ఎస్ వర్గాల టాక్.. ఈ నెల 21న ముహూర్త బలం బాగుందని.. ఆ రోజు సీఎం సెంటిమెంట్ ప్రకారం ఆయనకు కలిసొచ్చే నెంబర్ 6 వచ్చేవిధంగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. అంటే వచ్చే సోమవారం 78 లేదా 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే చాన్స్ ఉందంటున్నారు.

ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతుండటంతో ఆశావహులు.. సిట్టింగ్‌లు అలర్ట్ అయ్యారు. ఐతే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా క్యాడర్ సమావేశమవుతూ ఈ సారి సిట్టింగ్‌లకు సీట్ ఇవ్వొద్దని బహిరంగ ప్రకటనలు చేయడం బీఆర్‌ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇలాంటి సీట్లలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్, రామగుండం, మంథని, వేములవాడ, వర్ధన్నపేట, కల్వకర్తి వంటి నియోజకవర్గలు ఉన్నాయి. జనగామలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం సమావేశ అవ్వడం.. అక్కడకు వెళ్లిన ముత్తిరెడ్డి తనకే టిక్కెట్ అంటూ ప్రకటించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇక కల్వకుర్తి, రామగుండం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టిన బీఆర్‌ఎస్ నేతలు.. ఈ సారి సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తే ఓడిస్తామని ప్రకటించడం హీట్ పుట్టిస్తోంది.

Also Read: సీఎం కేసీఆర్ కొత్త మోసం- గృహలక్ష్మి పథకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో కూడా టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున లొల్లి జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పార్టీలో కొత్తగా వచ్చిన వారు, ఇంకా చేరని వారు తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని ఆరోపించి సంచలనం సృష్టించారు సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి (Nagam Janardhan Reddy). టిక్కెట్ కోసం తాను దరఖాస్తు చేయడమేమిటని.. ఇంతవరకు నేనెప్పుడూ టిక్కెట్ కావాలని అడగలేదని ప్రకటించిన నాగం.. తనకు టిక్కెట్ ఎందుకివ్వరని పరోక్షంగా అధిష్టాన్ని ప్రశ్నించినట్లైంది.

Also Read: మేము ప్రచారం చెయ్యం.. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ షాక్, ఎందుకో తెలుసా?

ఇక ఈ విషయమై పీసీసీ, సీఎల్పీ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నాయి. ఎంతటి నాయకులైనా టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటున్నాయి. దీంతో ఇన్నాళ్లు టిక్కెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు.. ఇప్పుడు పార్టీ సీటుపై డౌట్‌ పడుతున్నారు. పైరవీకారుల ప్రభావంతో తమకు ఎర్త్ పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఇదే అగ్ని పరీక్షగా మారబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు. టిక్కెట్ కోసం పోటీ పెట్టి.. అసమ్మతులు, అసంతృప్తులను రెచ్చగొట్టినట్లైందని.. టిక్కెట్లు దక్కని వారిని సంతృప్తి పరచడం కాంగ్రెస్‌కు శక్తికి మించిన పని అవుతోందని అంటున్నారు విశ్లేషకులు.

Also Read: మల్కాజ్‌గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!

ఇక బీజేపీలో ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా ఉంది పరిస్థితి. డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తామంటూ హడావుడి చేసిన తెలంగాణ బీజేపీ.. కొన్నాళ్లుగా సైలెంట్‌గా రాజకీయం నడిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు మార్పు ప్రభావం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నా.. పైకి ఎలాంటి సమాచారం పొక్కనీయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది బీజేపీ.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ల్లో చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా షెడ్యూల్ విడుదల కాకముందే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. తెలంగాణపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ రాష్ట్రాలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా.. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లిస్టులు విడుదలయ్యాకే బీజేపీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

ఈ పరిస్థితిపై కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టిక్కెట్ వస్తుందని ఆశతో బీజేపీలో చేరిన వారు.. ఆఖరి నిమిషంలో తేడా కొడితే ఏమీ చేయలేమనే కారణంతో తొందరగా జాబితా విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దాదాపు మూడు పార్టీల్లోనూ ఒకే విధమైన గందరగోళం ఉండటంతో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులపై క్లారిటీ వచ్చాకే మిగిలిన రెండు పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించడంతో గులాబీ పార్టీపై ఒత్తిడి పెరిగిపోయింది. జాబితా విడుదల చేశాక అసంతృప్తులు స్వరం పెంచితే ఎలా అదుపు చేయాలనే వ్యూహాన్ని ముందుగా సిద్ధం చేసుకుని ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని చూస్తోంది బీఆర్‌ఎస్.. మొత్తానికి రాజకీయం మొత్తం బీఆర్‌ఎస్ చుట్టూనే తిరుగుతుండటం.. ఎప్పుడూ లేనట్లు అసంతృప్తులు బాహాటంగా ప్రకటనలు చేస్తుండటమే హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు