హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో వైద్యులు విజయవంతంగా పేగు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. తెలంగాణలో జరిగిన మొట్టమొదటి పేగు మార్పిడి శస్త్రచికిత్స ఇదే.
షార్ట్ గట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల ఓ రోగి ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చేరాడు. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారికి పేరెంటల్ న్యూట్రిషన్ సపోర్ట్ అవసరమవుతుంది. అంతేగాక, ఆ రోగి సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్లు, మేజర్ సెంట్రల్ వెయిన్స్ థ్రాంబోసిస్‌తో పదే పదే బాధపడ్డాడు.
అతడికి అక్యూట్ సుపీరియర్ మెసెంటెరిక్ ఆర్టరీ మూసుకుపోయిన కారణంగా పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో గతంలో అతడి చిన్న పేగు, కుడి పెద్దపేగులో కొంత భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. డ్యూడెనోజెజునల్ ఫ్లెక్చర్ నుంచి ఉండే ప్రాక్సిమల్ జెజునమ్‌లో 30 సెంటీమీటర్లు మాత్రమే బాగుంది.
దీంతో, ఈ నెల 19న ఉస్మానియా వైద్యులు కాడవెరిక్ చిన్న పేగు మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఆ రోగి సాఫ్ట్ డైట్‌ను తినగలుగుతున్నాడు. అతడి ఇలియోస్టోమీ కూడా సరిగ్గా పనిచేస్తోంది. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఏడో రోజు చెకప్ ప్రొసీజర్ (ఎండోస్కోపీ) చేశారు. శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేసిన పేగు లోపలి భాగం ఆరోగ్యంగా, సాధారణంగా కనిపించింది. బయాప్సీ (చిన్న కణజాల నమూనాను తీసుకుని చేస్తారు)లో కూడా కొత్త పేగు బాగా పనిచేస్తోందని తేలింది.