Hyderabad Traffic Problem : హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఈ ఐదు సూత్రాలతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..

Hyderabad Traffic Problem : ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాలను గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పంచ సూత్రాలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.

Hyderabad Traffic Problem

Hyderabad Traffic Problem : హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.. పలు ప్రాంతాల్లో రెండుమూడు కిలో మీటర్ల దూరం ప్రయాణంకు గంటల తరబడి సమయం పడుతోంది. ఇక వర్షాల సమయంలో వాహనదారుల ఇబ్బందులు చెప్పలేనివి. వర్షాకాలం వచ్చిందంటే ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. కారణం.. వర్షం పడితే గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుండటమే. ప్రతీయేటా కొత్తగా వచ్చే కంపెనీలు, వాహనాలతో ట్రాఫిక్ ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ రద్దీకి ప్రధాన కారణాలను గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పంచ సూత్రాలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.

Also Read : Gold Silver Price Today : ఇక గోల్డ్ కొనలేమా? బాబోయ్ ఇదేం దూకుడు.. నేడు తులం బంగారం ధర ఎంతో తెలుసా..

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు ఐదు సూత్రాలతో చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు.
♦ ఐటీ కారిడార్‌లో 1200 వరకు చిన్నా, పెద్దా ఐటీ కంపెనీలుండగా.. దాదాపు 12లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. దీంతో ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసుకోవడానికి కంపెనీల ముందు రహదారులపై క్యాబ్‌లు, ఆటోలు నిలపడంతో ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. ఇకనుంచి ఆ వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక ప్రాంతాలను కేటాయించేలా కంపెనీలు చర్యలు చేపట్టాలని సూచించారు.
♦ ఐటీ ఉద్యోగులు సొంత వాహనాల్లో రావడం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కంపెనీలు కార్ పూలింగ్ ను ప్రోత్సహించాలని ప్రతిపాదించారు.
♦ కార్పొరేట్ కంపెనీల ప్రధాన ద్వారాల నుంచి ఒకేసారి ఉద్యోగుల వాహనాలు, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు బయటికి రావడంతో రహదారులపై ట్రాఫిక్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీనిని నియంత్రించేలా కంపెనీల ప్రధాన ద్వారాల వద్ద ఉండే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
♦ కొన్ని కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులు ఉన్నా.. ఉద్యోగుల రాకపోకలకోసం ఎక్కువ బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అలాకాకుండా ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని తక్కువ బస్సుల ద్వారా వారిని పికప్, డ్రాపింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
♦ ఐటీ కంపెనీల లాగిన్, లాగౌట్ వేళలు ఒకేలా ఉండటం, ఉద్యోగులు ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది. ఇందుకు పరిష్కారం కోసం.. ఐటీ కారిడార్ లో జోన్ల వారీగా కంపెనీలు లాగిన్, లాగౌట్ విధానం అమలు చేయాలని, పెద్ద కంపెనీలు ఒకే సమయానికి బదులుగా కొంత వ్యవధితో వీటిని పాటించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఐదు సూత్రాలను పాటించడం ద్వారా ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చునని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.