Dog Attack Baby Dies: హైదరాబాద్ షేక్‌పేటలో విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల పసికందు మృతి

షేక్‌పేట వినోబానగర్‌లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల పసికందు ఆస్పత్రిలో 17రోజులుగా మృత్యువుతో పోరాడుతూ కన్ను మూశాడు.

Street Dogs

Street Dog Attack : నగరంలో విషాదం చోటు చేసుకుంది. మరో చిన్నారి వీధికుక్కల దాడిలో గాయపడి మృతిచెందాడు. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు ఆస్పత్రిలో 17రోజులుగా మృత్యువుతో పోరాడాడు.. చిన్నారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వివరాల్లోకి వెళితే..  షేక్‌పేట వినోబానగర్‌లో అనూష, అంజి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 8న శరత్ ను గుడిసెలో పడుకోబెట్టి పనులకోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. వారు తిరిగి ఇంటికొచ్చి చూడగా కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో ఏడుస్తూ కనిపించాడు.. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు నిలోఫర్ కు తరలించారు. అక్కడ సిబ్బంది సూచనలతో ఉస్మానియాకు తరలించారు.

Also Read : VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

ఉస్మానియా వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేసి ఎన్ఎస్ఐసీయూలో ఉంచారు. చికిత్స పొందుతూ పసికందు కన్నుమూశాడు. చిన్నారిపై మూడు వీధి కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. పసికందు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలాఉంటే.. తాజా ఘటనతో జీహెచ్ ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల బెడదను తొలగించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది విఫలమవుతున్నారని, ఫలితంగా చిన్నారులు కుక్కల దాడిలో తరచూ గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read ; Crimes Against Women : దేశంలో మహిళలపై పెరిగిన నేరాలు…నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెబుతుందంటే…

గతంలోనూ నగరంలో పలుసార్లు వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల అంబర్ పేటలో జరిగిన సంఘటన మరువక ముందే షేక్ పేటలో విషాదం చోటు చేసుకోవటంతో నగరంలోని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను తొలగించాలని సనగర వాసులు కోరుతున్నారు.