Floods in Hyderabad key indicators of Retired IAS Officer Jayaprakash : నగర పాలక సంస్థలను పూర్తిగా మార్చండి..సంక్షోభం ఎక్కడ ఉన్నా నగరాల చుట్టూ ఉంది. ప్రజలను భాగస్వాములను చేయాలి. సిటీలో అధికారం, పదవి లేని వారు ఉన్నారు. వీరు పరిష్కారాలు చూపించగలరు, వీరిని భాగస్వాములు చేయడం లేదన్నారు రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ (కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.).
నగరంలో వరద నీరు పోటెత్తకుండా..ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై 10tvలో చర్చ జరిగింది. ఈ చర్చలో జయప్రకాష్ పాల్గొని సూచనలు, సలహాలు అందచేశారు.
ఆయన ఏమన్నారంటే..
‘స్థానిక ప్రభుత్వాలు..స్థానిక ప్రభుత్వాలుగా పని చేయాలి. ఎమ్మెల్యేలు కూర్చొగానే..పెత్తనం వారి చేతుల్లో పోతుంది, ఇది సరైన పద్దతి కాదు. సంప్రదాయాన్ని, గౌరవాన్ని పాటించాలి. నగరంలో ఉన్న మేయర్ చేతుల్లో అధికారం ఉందా ? నగర ప్రాంతాలకు మీసమెత్తు అధికారం లేకుండా చేశారు…సంస్థలకు పూర్తి గౌరవం ఇవ్వండి..బాధ్యతలు ఇవ్వండి..జవాబుదారితనం ఉండే విధంగా యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
పూర్తిగా అధికారం ఇచ్చి..చేతులు ముడుచుకుని కూర్చొమనడం లేదు..బాధ్యత పెట్టి సమీక్ష జరపండి. అధికారం అంతా..కమీషనర్ చేతుల్లో ఉంటుంది. స్థానికంగా వార్డు కమిటీలు కాగితాల మీద ఉన్నాయి. ఈ కమిటీలను ఇన్ వాల్వ్ చేయాలి. తద్వార లోతట్టు ప్రాంతాలను గుర్తించడం, వారిని ఒప్పించడం జరుగుతాయి.
కాంటూరు సర్వే వెంటనే చేపట్టండి. రూ. 30 నుంచి 40 కోట్లు ఖర్చవుతుంది. లే అవుట్లు, డ్రైన్లు కొత్తగా ఏర్పాటు చేయాలి. పెద్ద డ్రైన్లకు స్థానికంగా ఉన్న డ్రైన్లకు కాంటాక్ట్ చేయాలి. మూడు, నాలుగు ఏళ్లలో పూర్తయ్యే విధంగా ప్రణాలికలు రచించాలి. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 20 వేల కోట్ల సర్ ప్లస్ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులు, నగరంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు…ఈ రెండింటింకి తేడా..రూ. 20 వేల కోట్ల ఉంటుందని అంచనా.
డబ్బులో కొంత భాగమైనా నగరానికి ఇస్తున్నారా ? 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు కాకుండా..రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగర పాలక సంస్థకు పన్నులో వాటా ఎంతిస్తున్నారు ? దాదాపు శూన్యం. వనరులు కేటాయించాలి. వేగంగా పనులు జరిగే విధంగా చూడాలి.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని విధిగా తొలగించి వేరే ప్రాంతంలో పునారావసం కల్పించాలి. నిరుపేదలను రోడ్డుపై పడేయకుండా..వారిని ఆదుకోవాలి. నగరంలో పెద్ద ఎత్తున్న గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం సంకల్పిస్తుండడం అభినందించా. కానీ..ఇక్కడ సంకల్పమే కానీ..ఆచరణలో రాదు. వెంటనే తగిన ప్రణాళికలు రచించి..నగరంలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి’ అన్నారు.