Nallamala forest tension : గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడి..తీవ్ర ఉద్రిక్తంగా మారిన నల్లమల

నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడి అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గిరిజన మహిళలపై అటవీ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ... తండాలకు చెందిన గిరిజనులు... అధికారులపై దాడి చేశారు.

Forest Officials Attacking Tribal Women Tension In The Nallamala Forest Area

Nallamala forest officials attacking tribal women : నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడి అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అటవీ ఉత్పత్తులు సేకరణకు వెళ్లిన గిరిజన మహిళలపై అటవీ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ… తండాలకు చెందిన గిరిజనులు… అధికారులపై దాడి చేశారు. ఫారెస్ట్ చెక్ పోస్టును ధ్వంసం చేశారు. తమ వారిపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ధర్నా నిర్వహించారు. దీనితో దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

అచ్చంపేట మండలం పలుగుతండాకు చెందిన గిరిజనులు అమ్రాబాద్ మండలం అడవిలో వెళ్లారు. ఆ సమయంలో అటవీశాఖ ఫైర్ సిబ్బంది వారిపై దాడి చేశారు. దీంతో నల్లమల ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న నల్లమలలో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వర్సెస్ గిరిజనులుగా మారింది. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నల్లమలలో వరుస అగ్ని ప్రమాదాలతో అలర్ట్ అయిన ఫారెస్ట్ అధికారులు అడవిలోకి ఎవరికి అనుమతి లేదంటూ గిరిజనులను అడ్డుకుంటున్నారు. దీంతో జీవనోపాధి కోల్పోతున్న గిరిజనులు… ఫారెస్ట్ అధికారుల తీరును వ్యతిరేకిస్తున్నారు. దీంతో వివాదం మొదలైంది. ఇదే సమయంలో ఫారెస్ట్ అధికారులు గిరిజన మహిళపై దాడి చేయడంతో ఒకసారిగా పరిస్థితి అదుపు తప్పింది. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ బేస్ క్యాంపు వద్ద బాధితులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

అటు గిరిజనులపై ఎలాంటి దాడి చేయలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. డ్యూటీలో వున్న సిబ్బందిని చూసి పారిపోతున్న సమయంలో కిందపడి గిరిజనులకు గాయాలయ్యాయన్నారు. ఆ తర్వాత వారే ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో వున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మొత్తానికి నల్లమలలో చోటు చేసుకున్న ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజనులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పరామర్శించారు. గిరిజనులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనులపై దాడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించే వరకు పోరాడతామన్నారు. దాడి ఘటనపై సీఎం, డీజీపికి పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. గిరిజనుల హక్కులు అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. గాయపడిన గిరిజనులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు.