కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Patnam Narender Reddy

Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వికారాబాద్ తరలించారు. ఆయన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. సురేశ్ కు నరేందర్ రెడ్డి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే.. వికారాబాద్ జిల్లా కలెక్టర్, పలువురు అధికారులపై లగచర్లలో స్థానికులు దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు. ఇప్పటికే లగచర్ల కేసులో 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. దాడి ఘటనలో అనుమానితులైన 50 మందిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also Read: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, పలువురు అధికారులపై సోమవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. లగచర్ల గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో టీజీఐఐసీ భూ సేకరణలో భాగంగా ప్రజాభిప్రాయం కొరకు కలెక్టర్, ఇతర అధికారులు వెళ్లారు. అయితే, లగచర్ల గ్రామస్తులు ఒక్కసారిగా కలెక్టర్ సహా అధికారులపై దాడి చేశారు. పలువురు అధికారులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటాక లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండాల్లోకి వందల మంది పోలీసులు వెళ్లి.. దాడిలో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విచారణ చేశారు. దాడిలో ప్రమేయం ఉన్న 16 మందిని పోలీసులు అరెస్టు చేసి.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు.

 

కలెక్టర్, అధికారులపై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ దాడి వెనుక కుట్రకోణం దాగిఉందని, కావాలనే ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిసైతం స్పందించారు. దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాడి కేసులో ప్రధాని నిందితుడుగా ఉన్న సురేశ్.. నరేందర్ రెడ్డి అనుచరుడు. దాడికి ముందు పలుసార్లు నరేందర్ రెడ్డితో సురేశ్ ఫోన్లో మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అధికారులపై దాడి ఘటనలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మంగళవారం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. బుధవారం ఉదయం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.