Teegala Krishna Reddy
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం తీగల కృష్ణారెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను టీడీపీలో చేరతానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వల్లనే హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని, వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే కాలంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తీగల కృష్ణారెడ్డి అన్నారు.
Also Read: Akkineni Nagarjuna : నాగార్జున పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం..
తీగల కృష్ణారెడ్డితోపాటు చంద్రబాబు నాయుడును కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో వివాహానికి హాజరు కావాలని చంద్రబాబుకు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు శుభలేఖను అందజేశారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన తరువాత.. కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డికూడా ఆయనతో ఉన్నారు. దీంతో వారు కూడా టీడీపీలో చేరబోతున్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. గతంలో మల్లారెడ్డి టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం చర్చకు దారితీస్తోంది. అయితే, ఈ అంశంపై మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.