Konda Vishveshwar Reddy : కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ ఎంపీ

అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

Konda Vishveshwar Reddy

MP Konda Vishveshwar Reddy : అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(61) కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. రాజీనామాపై తన అనుచరులకు తొలుత సమాచారం ఇచ్చిన ఆయన, తర్వాత లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆయన భావించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరక్కూడదనే ఉద్దేశంతో ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎన్నిక జరిగిన మరునాడే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారే.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే జీహెచ్ఎంసీ మాజీ ఎంపీ కొండావైపు బీజేపీ చూసింది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే కొండాను ఆహ్వానించింది. దీంతో అప్పట్లోనే ఆయన కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ లోనే కొనసాగడంతో కొంతకాలం ఆ ప్రచారానికి తెరపడింది.

2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై చేవెళ్లలో పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు కొండా. ఆ తర్వాత టీఆర్ఎస్ ను వీడి 2018లో కాంగ్రెస్ లో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ తనకు భవిష్యత్తు కల్పించకపోవడం, అలాగే టీఆర్ఎస్ ను ఢీకొనే ఏకైక పార్టీగా బీజేపీ కనిపించడంతో ఎట్టకేలకు ఆ పార్టీలో చేరాలని కొండా నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో చేవెళ్ల టికెట్ పై బీజేపీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఇంతకాలం ఆ పార్టీలో చేరలేదు. చివరికి టికెట్ పై క్లారిటీ రావడంతో కాంగ్రెస్ వీడారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.