భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల చిన్నారిపై నక్క దాడి

  • Publish Date - November 19, 2020 / 12:52 PM IST

fox attack boy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల బాలుడిపై నక్క దాడి చేసింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలుడిపై దాడిచేసిన నక్క పది అడుగుల దూరం లాక్కెళ్లింది. పాల్వంచకు 40 కిలోమీటర్ల దూరంలో..దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలకలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో బాలుడిని పూరింటి వసారాలోని చీర ఉయ్యాలలో నిద్రపుచ్చారు తల్లిదండ్రులు.

కొద్దిసేపటికి చెట్లపొదల్లోంచి వచ్చిన నక్క చిన్నారిపై దాడి చేసింది. గోళ్లతో రక్కి…గాయపరిచింది. బాలుడ్ని నోటకరుచుకుని పది అడుగుల దూరం లాక్కెళ్లింది. చిన్నారి ఏడుపు విని అక్కడకు వచ్చిన తల్లిదండ్రులు నక్కను తరిమి కొట్టారు. ముఖం, తలభాగంలో తీవ్ర గాయాలైన చిన్నారికి పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తలకు గాయమైన చోట కుట్లు వేశామని, చిన్నారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.