Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) నడుపుతున్న సాధారణ బస్సులతో పాటు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సు ల్లో మహిళలు పాక్షికంగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండగా ఇక మున్ముందు ప్రవేశపెట్టే ప్రతీ ఎలక్ట్రిక్ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే.. భవిష్యత్తులో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణ యించింది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే.. వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది. పథకం అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఒక కొత్త విధానాన్ని కూడా అమలులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో రెండేళ్ల నాటికి మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. విడతల వారీగా బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో ఇప్పటికే ఆర్టీసీ పలు రూట్లలో 297 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. బుధవారం ప్రారంభించిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరుకుంటుంది.
2026 జనవరి, ఫిబ్రవరి నాటికి హైదరాబాద్ కు మరో 178 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో జనాభాతో కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈక్రమంలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.