కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం గడల శ్రీనివాసరావు ప్రయత్నాలు

Gadala Srinivasa Rao Application for Congress Khammam MP ticket

Gadala Srinivasa Rao: తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన స్నేహితుడు రాము దరఖాస్తు చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన దరఖాస్తు సమర్పించారు. కాగా, దరఖాస్తులు సమర్పించేందుకు గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు గడల శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్తగూడెం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. వీలు కుదిరినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొత్తగూడెంలో సామాజిక సేవా కార్యక్రమాలతో కేసీఆర్ దృష్టిలో పడేందుకు యత్నించారు. హెల్త్ డైరెక్టర్ పదవిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు.

Also Read: వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ పదవికి ఆయన దరఖాస్తు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం ఎంపీ స్థానానికి హస్తం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సోనియా పోటీ చేయకుంటే కచ్చితంగా తనకు సీటు వస్తుందని సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి తదితరులు ఖమ్మం సీటు ఆశిస్తున్నారు.