Gaddar
Gaddar: ప్రజా గాయకుడు, విప్లవ వీరుడు గద్దర్ కన్నుమూశారు (Gaddar Passed Away). అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్(Hyderabad)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్‌కు పది రోజుల క్రితం గుండెపోటు రావడంతో అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గద్దర్ ఒగ్గు కథ, బుర్ర కథల ద్వారా పల్లె ప్రజలను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్ మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Gaddar Passed Away : గద్దర్ ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర ఉండాల్సిందే.. అది ఎవరిచ్చారో తెలుసా?
గద్దర్ పార్ధివదేహాన్ని ఎల్బీ నగర్ స్టేడియంలో అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటల వరకు గద్దర్ పార్ధిదేహం ఎల్బీనగర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. అయితే, గద్దర్ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమ యాత్రప్రారంభమవుతుంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు అంతిమ యాత్ర సాగుతుంది. అల్వాల్‌లో గద్దర్ పార్థివదేహాన్ని కొంత సమయం ఉంచనున్నారు. అనంతరం సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్ధీవ దేహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కిన్నెర మొగిలియ్యలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నివాళులర్పించారు. గద్దర్ ను చివరిసారి చూసుకొనేందుకు ఆయన అభిమానులు ఎల్బీ స్టేడియంకు భారీగా తరలివస్తున్నారు.