Gadwal Tejeshwar case
Gadwal Tejeshwar Case: జోగుళాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య (తేజేశ్వర్ భార్య)తోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం తిరుమలరావు, ఐశ్వర్యలను మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని గద్వాల్ పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Telangana: కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..
తేజేశ్వర్‌తో ఐశ్వర్యకు నిశ్చితార్ధం జరిగింది. అయితే, ఆమెకు తేజేశ్వర్ అంటే ఇష్టం లేదు. అప్పటికే తన ప్రియుడు, బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమల రావుతో ప్రేమలో ఉంది. నిశ్చితార్ధం జరిగిన తరువాత ఐశ్వర్య కర్నూలులోని ఆమె ఇంటి నుంచి ప్రియుడు తిరుమలరావు వద్దకు వెళ్లిపోయింది. దీంతో తిరుమల రావు ఆమెను బెంగళూరులోని ఓ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న తన చెల్లిలి వద్దకు పంపించాడు. కొద్దిరోజులు అక్కడే ఉండాలని, ఆ తరువాత ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని ఐశ్వర్యకు తిరుమలరావు సూచించాడు.
మరోవైపు.. ఐశ్వర్య కనిపించక పోవటంతో ఆమె సోదరుడు కర్నూలులోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఐశ్వర్యను బెంగళూరులోని వసతిగృహంలో ఉంచినట్లు తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తిరుమలరావును మందలించడంతో వెంటనే ఐశ్వర్యంను తీసుకొచ్చి మళ్లీ కర్నూలులోని ఆమె నివాసంలో వదిలిపెట్టాడు. అయితే, నిశ్చితార్థం కాకముందు నుంచే ఐశ్వర్యపై తిరుమలరావుకు అనుమానం ఉండేది. వేరే వ్యక్తులతో ఆమె సన్నిహితంగా ఉంటుందని భావించేవాడు. దీంతో ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునేందుకు ఆమె స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు.
జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుంది.. రోజంతా ఏఏ ప్రాంతాలకు వెళ్తుంది.. ఆమె ఎవరెవర్ని కలుస్తుందనే విషయాలను తిరుమలరావు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడని పోలీసులు విచారణలో తేలింది. తిరుమలరావు చెప్పిన ప్రకారం కర్నూలు పోలీసులు ఐశ్వర్య ఇంటి వద్దకు వెళ్లి ఆమె స్కూటీని తనిఖీ చేశారు. దీంతో ఆమె స్కూటీకి ఉన్న జీపీఎస్ ట్రాకర్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.