Hyderabad Ganesh Laddu Auction
Kirti Richmond Villa Ganesh Laddu 2023 Auction: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనంకోసం సాగనంపుతున్నారు. బైబై గణేశా.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ భక్తులు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ విఘ్నేశ్వరుడి శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గణపతి లడ్డూలను దక్కించుకొనేందుకు భక్తులు పోటీపడుతున్నారు. పలు ప్రాంతాల్లో లడ్డూ ధరలు లక్షల్లో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో లడ్డూ ధర ఏకంగా కోటి పలికింది.
Read Also: కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. ఈ మార్గాల్లో రాకపోకలు బంద్ Live Updates
గణేశ్ ఉత్సవాల్లో అన్నింటికంటే ఆసక్తికరమైన ఘట్టం లడ్డూవేలంపాట. గణనాథుడి లడ్డూను దక్కించుకోవటాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. తమ బంధుమిత్రులకు ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఈ క్రమంలో లడ్డూను దక్కించుకునేందుకు కొందరు లక్షలాది రూపాయలు వెచ్చించేందుకైనా వెనుకాడరు. లడ్డూకోసం పోటాపోటీగా వేలం పాటలు జరుగుతాయి. అయితే, హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాలో వినాయకుని లడ్డూకు భారీ ధర పలికింది. ఏకంగా రూ. 1.26కోట్లకు ఇక్కడి లడ్డూను వేలంపాటలో అసోసియేషన్ ప్రతినిధులు దక్కించుకున్నారు. లడ్డూధర ఇంత భారీ మొత్తంలో పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ.60.80లక్షలు పలికింది.
Read Also: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
మరోవైపు హైదరాబాద్‌లోని మై హోమ్ భుజా కమ్యూనిటీలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాటకు అనూహ్య స్పందన వచ్చింది. లక్ష రూపాయలతో ప్రారంభమైన ఈ వేలంపాట ఏకంగా రూ.25.50లక్షలు పలికింది. ఈ లడ్డూను రియల్టర్ చిరంజీవి గౌడ్ దక్కించుకున్నాడు. వరుసగా మూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ లడ్డూ వేలంపాటలో ఇదే అత్యధిక ధర. గతేడాది వేలంపాటలో లడ్డూకు రూ.20లక్షల 50వేలు పలకగా.. అంతకుముందు ఏడాదిలో రూ.18లక్షల 50వేలు దాటింది.