Gangula Kamalakar
Telangana Assembly Elections 2023 : కేసీఆర్ ను ఓడగొడదామని ఆంధ్రావాళ్లు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరాకు చేస్తారని మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. నియోజకవర్గంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి, షర్మిల, పవన్ కల్యాణ్, కేఏ పాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నిధులివ్వాలని దండం పెట్టానని, ఆయన వెకిలి నవ్వు నవ్విండని, కిరణ్ తీరుపట్ల నాకు బాదేసిందని, ఏడ్చానని గంగుల చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ నిధులిచ్చారని, అప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని అన్నారు.
కత్తులు కడుపులో పెట్టుకొని ఆంద్రోళ్లు మళ్లీ వస్తున్నారు. తెలంగాణ వదిలి పెట్టిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ వచ్చాడు. బీజేపీ జనసేన పొత్తు అంటూ పవన్ కల్యాణ్ వస్తున్నాడు. షర్మిల తెలంగాణలో హడావిడి చేస్తుందని గంగుల అన్నారు. షర్మిల.. నీది కడప. మీ అన్న ఏపీలో సీఎం.. అక్కడకు వెళ్లి చేయి నీ పాదయాత్ర అంటూ గంగుల సూచించారు. కేఏ పాల్ కూడా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాడు.. ఎవర్రా వీరంతా అంటూ గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా కేసీఆర్ ను ఓడగొడతామని అంటున్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.. ప్రజలంతా ఏకమై ఆంధ్రోళ్లకు అడ్డుకట్ట వేయాలని గంగుల అన్నారు.
Also Read : CM Jagan : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
బీజేపీ ఎంపీ, కరీంనగర్ నియోజవర్గం అభ్యర్థి బండి సంజయ్ పై గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఓ డ్రామా ఆర్టిస్ట్, పెద్ద దొంగ. సంజయ్ నియోజకవర్గం అభివృద్ధికి రూపాయి కూడా తేలేదు. రూపాయి బిళ్ల తెచ్చాడంటే నేను వెళ్లిపోతా అంటూ గంగుల అన్నారు. బండి సంజయ్ టికెట్ కు రూ. 20 కోట్లు తీసుకున్నాడని, కాంగ్రెస్ టికెట్ ఓ దొంగకు ఇచ్చారంటూ గంగుల విమర్శించారు.