Fire incident Karimnagar
Karimnagar : కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో సుభాష్ నగర్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 15 పూరిగుడిసెలు దగ్దమయ్యాయి. మంటల ధాటికి ఇళ్లలోని వంట గ్యాస్ సిలిండర్లు పేలాయి. దాదాపు 10 సిలిండర్లు పేలినట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ పూరి గుడిసెల్లోనే కూలీలు నివాసం ఉంటున్నారు. ఇక్కడి కూలీల కుటుంబాలు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లాయి. ఇళ్లలో ఎవరూ లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది.
Also Read : నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరు మృతి
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ మంటలు వ్యాపించడానికి సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీనే కారణంగా తెలుస్తోంది. పూరి గుడిసెల్లో ఉండేవారంతా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు ఇంట్లో పూజలు నిర్వహించి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడం.. ఇంట్లో వెలిగించిఉన్న దీపాల నుంచి మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ కారణంగా తొలుత ఒక గ్యాస్ సిలీండర్ పేలడంతో మంటలు వ్యాపించాయని, పూరిగుడిసెలు కావటంతో వేగంగా మటలు వ్యాపించడంతో చూస్తుండగానే గుడిసెలు దగ్దమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెల్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్దమయ్యాయి. బీరువాల్లోని బట్టలు, ఇతర సామాగ్రికూడా దగ్దమయ్యాయి.